
టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ
తిరుపతి క్రైమ్ : తిరుపతిలోని బైరాగిపట్టెడలో పద్మావతి పార్క్ ఎదురుగా టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది. క్రైమ్ సీఐ ప్రకాష్ కథనం మేరకు.. టీటీడీలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఈనెల 14వ తేదీన సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం వేకువజామున తిరిగి ఇంటికి వచ్చారు. మెయిన్ గేటు, తలుపులు పగులగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో 207 గ్రాముల బంగారం, 460 గ్రాముల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని, దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వెల్లడించారు.
ఎస్వీయూ జోనల్ స్థాయి పోటీలు ప్రారంభం
తిరుపతి సిటీ: నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకుని సోమవారం ఎస్వీయూ తారకరామా స్టేడియంలో జోనల్ స్థాయి పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. సుమారు 8 జిల్లాల నుంచి విచ్చేసిన 1700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు ఈ నెల 29న జరిగే స్పోర్ట్స్ డే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నగదు, ప్రశంసాపత్రాలు, పతకాలు అందించనున్నట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి పాఠశాలలో ఆటస్థలాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.30 వేల నిధులు పాఠశాలలకు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, డీఎస్డీఓలు శశిధర్, బాలాజీ, ఉదయ్, రాజు, జగన్, పెద్ద సంఖ్యలో కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
గూడూరురూరల్ : సౌత్‌జోన్ ఆర్చరీ పోటీల్లో లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి కె.చరిత్ ప్రతిభను కనబరచినట్లు కరస్పాండెంట్ బి.శ్రీకాంత్‌రెడ్డి సోమవారం తెలిపారు. అలాగే ఆదివారం ఒంగోలులో నిర్వహించిన ఆలిండియా కరాటే ఓపెన్ చాంపియన్ షిప్‌లో గూడూరులోని సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు మోక్షిత్, గృశ్నేశ్వర్ ద్వితీయ పొందినట్లు హెచ్‌ఎం దయాకర్ తెలిపారు.

టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ

టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ