
జంతు పరిరక్షణ అందరి బాధ్యత
తిరుపతి మంగళం : శేషాచల జీవవైవిధ్య అభయారణ్యంలో అంతరించిపోతున్న మూషిక జింక, బంగారు బల్లి, దేవాంగ పిల్లి, రంగుల ఉడుత, పసుపు గొంతు పిగిలి పిట్ట వంటి అరుదైన జంతు జాతుల పరిరక్షణ అందరి బాధ్యతని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తెలిపాలని ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. సోమవారం ఆయన పార్లమెంటులో మాట్లాడారు. వన్యప్రాణుల రక్షణ, వేటగాళ్ల నిరోధం, ప్రజల భాగస్వామ్యం వంటి చర్యల కోసం నిధులు కేటాయిస్తున్నారా? అని ప్రశ్నించారు.కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిస్తూ ‘వన్యప్రాణుల నివాసాల అభివృద్ధి’ పథకం కింద రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. రూ.121.63 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలం సింహాచలకండ్రిగలో 125 ఎకరాల రక్షిత అటవీ భూమిని టీడీపీ ప్రజాప్రతినిధి స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షిత అటవీ భూములను కాపాడడం సంబంధిత అధికారుల బాధ్యతని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.