
సాక్షి, తిరుపతి: తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్‌సీపీ భయపడదు అంటూ హెచ్చరించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్ నాయుడు) ఆధ్వర్యంలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోంది. భక్తుల అవస్థలను బీఆర్ నాయుడు పట్టించుకోవడం లేదు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు. టీవీ-5 ప్రసారం చేసే అబద్ధాలకు వేల సంఖ్యలో పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి. బీఆర్ నాయుడు రూ.10వేల కోట్ల పరువు నష్టం ఇవ్వాల్సి ఉంటుంది.
బీఆర్ నాయుడు, చంద్రబాబు ప్రజస్వామ్య ద్రోహం చేస్తున్నారు. తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారు. ఆయన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను వైకుంఠం పంపించారు. టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు చేయలేదా?. ఢిల్లీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా?. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాప వినాశనంలో బోట్లు షికారు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది.

టీవీ5 చానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులపై మీ చానెల్‌లో చూపిస్తున్నారు. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు కాదా?. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?. మీ చానెల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు. టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. రెండు గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు.. అది ఏమైంది?. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్స్ పొందడం లేదా?. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి, ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దు చేసే దమ్ము మీకు ఉందా?. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి బీఆర్ నాయుడు.. ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు?. టీవీ5 చానెల్ ఎలా పెట్టాడు’ అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్‌సీపీ భయపడదు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో సాక్షి మీడియా ముందుంది’ అని చెప్పారు.