సాక్షి, తిరుపతి: పరకామణి చోరీ కేసులో వైఎస్సార్‌సీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్ విచారణ ముగిసింది. మంగళవారం సాయంత్రం అధికారుల ఎదుట హాజరైన ఆయన్ని 25 నిమిషాలపాటు విచారించి పంపించేశారు. అయితే.. విచారణకు హాజరయ్యే ముందు, ఆ తరవాత ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విచారణకు ముందు.. నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు నన్ను కచ్చితంగా విచారణ చెయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు.. ’’ అని భూమన అన్నారు.
విచారణ అనంతరం.. నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని ...? 15 ఏళ్లలో శ్రీ వారికి తలనీలాలు ఎంత మంది సమర్పించారూ.. అనేవిధంగా ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. పరకామణి కేసు విషయంలో నాకు అంతే తెలుసు. పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని చెప్పి వెళ్లిపోయారాయన.


