సాక్షి, కాకినాడ: 18 నెలల పాలనలో రైతును నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం.. పంచ సూత్రాల పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం ధరల స్థిరీకరణ ప్రణాళికతోపాటు నిధీ కూడా లేని చంద్రబాబు ప్రభుత్వానికి.. రైతన్నా మీ కోసం అని తిరగడానికి సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్టే లేదని.. ఉన్నదల్లా చంద్రబాబు వ్యక్తిగత మార్కెటింగేనని తేల్చి చెప్పారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల జరిగన నష్టం కన్నా.. ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువుగా ఉందని ఆక్షేపించారు. అరటికి రేటు లేదని రైతులు గోలపెడుతుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ బాబు కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా రూ.99 పైసలకే సంతర్పణ చేసిన చరిత్ర మరే ప్రభుత్వానికీ లేదన్న ఆయన.. దీన్ని విశాఖ భూదోపిడీకి జరుగుతున్న పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
రైతులను మభ్యపెట్టే కార్యక్రమం..
గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి.. తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది. 18 నెలల కూటమి పాలనలో కంటతడిపెట్టని రైతు లేడు. వరి దగ్గర నుంచి అపరాలు వరకు, అరటి నుంచి కొబ్బరి వరకు ఏ పంట పండించిన రైతును కదిలించినా ఒకటే బాధ. కానీ చంద్రబాబు తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడో.. ప్రజలను మభ్యపెట్టాలనుకున్నాడో తెలియడం లేదు. ఇది ఆశ్చర్యం.
రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని చూస్తే.. అశ్వద్ధామ హతహ్ హతహ్ కుంజరహ తరహలో.. రైతన్నా మీ కోసం అని గట్టిగా చెబుతూ.. మనసులో మాత్రం మీకేమీ చేయలేం అన్నది గుర్తుకు వస్తుంది. రైతులు కోసం మీరు ఏం మేలు చేశారని చంకలు గుద్దుకుంటూ భుజాలెగరేస్తున్నారు? రైతులను కాలరెగరేసుకునేలా చేస్తామని చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా? రాష్ట్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ఫలానా పంట పండించిన రైతు ఆనందంగా ఉన్నాడని ఇచ్చాపురం నుంచి తడ వరకు, అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ఒక్కరిని చూపించండి.
కనీసం అంటే కనీసం మానవత్వం, ప్రేమ, దయలేని ప్రభుత్వమిది. పండించిన పంటకు దిక్కూ మొక్కూ లేదు కానీ పంచ సూత్రాల పేరుతో రైతన్నా మీకోం అని తయారై ఇంటింటికీ తిరుగుతూ ఏం చేయబోతున్నారు. రైతు పండించిన పంటకు దిక్కులేదు కానీ పంచసూత్రాల పేరుతో ప్రచారానికి మాత్రం తయారయ్యారు.
పంచ సూత్రాలు- పచ్చి అబద్దాలు
నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్..ప్రపంచ వేదికగా మార్కెటింగ్.. ఇలా మీ మాటలు వినడానికి మాత్రం సొంపుగా ఉంటాయి. వీటిలో ఒక్కటీ చేసిన పాపాన పోలేదు. నీటి భద్రత తీసుకుంటే.. ఒక్క కాలువ కూడా మీరు బాగుచేయలేదు. రెండోది డిమాండ్ ఆధారత పంటలు... ఉల్లి, టమోట రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పొలంలోనే విడిచిపెడుతున్న దుస్థితి. కనీసం ఫలానా పంటకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ పంట సాగుచేయండి అనైనా మీరు రైతులకు చెప్పలేదు. అదీ లేదు.
అగ్రిటెక్.. ఈ విషయంలో మీ ప్రభుత్వం మరింత ఫెయిల్. ఏ విషయంలో టెక్నాలజీని వ్యవసాయానికి సంధానం చేశారు. ఉన్న ఇ-క్రాప్ పథకాన్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. పుడ్ ప్రాసెసింగ్ విషయానికొస్తే... రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో ఫలానా దగ్గర ఉంది అని మీరు చెప్పండి. చివరిగా ప్రపంచవేదికగా మార్కెటింగ్ .. ఇక్కడ దిక్కులేదు కానీ ప్రపంచ వేదిక అని చెబుతున్నారు.
అరటి రైతుల వెతలు పట్టని ప్రభుత్వం..
మీరు అమలు చేస్తున్న పంచ సూత్రాలేమిటంటే... రైతుకు ఆశపెట్టి బొమ్మ చూపించడం, పబ్బం గడుపుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, మోసం చేయడం, పబ్బం గడుపుకోవడం ఇదే మీ పంచ సూత్రాలు చంద్రబాబూ. ఇంత అన్యాయంగా రైతుల పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు? అరటి పంట ధర దారుణంగా పడిపోయి, రైతులు దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు.
ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే.. త్వరలో ఏపీ అరటిని కొంటాం అన్న ఈ వార్త చూస్తే.. కేంద్ర ప్రభుత్వమే ఆదుకుంటుందేమోనని అనిపిస్తుంది. ఈ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వమూ కాదు. ఢిల్లీ దగ్గర ఉన్న ఆజాద్ పూర్ మండి వ్యాపారులు హామీ ఇచ్చారని ఈనాడులో రాశారు. మరో వార్తలో రైతుల్లో కలవరం, వాతావరణంలో మార్పు.. గోనె సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యం నమోదవ్వని వైనం, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం... అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది.ఈ రెండు వార్తలు రాష్ట్రంలో ఉన్న రెండు పవిత్ర పత్రికల్లో వచ్చాయి. వీటిని కూడా అబద్దాలు అని మీరు కొట్టిపారేస్తారా?
18 నెలల్లో ఒక్క పంటకూ లేని మద్ధతు ధర..
18 నెలల కాలంలో ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. టమోట పంటను రైతులు ధర లేకపోవడంతో కోయలేక వదిలిపెట్టారు. మామిడికి ధరలేదు, మద్ధతు ధర ఇస్తామని ఇవ్వలేదు. మొక్క జొన్న రైతులైతే దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు. పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అధికంగా మొక్కజొన్న పండిస్తారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాళ్లకి రూ.2300 నుంచి రూ.2400 కొంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.1700 మాత్రమే ధర పలుకుతుంది. మా ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాడు చేసి.. అన్నిచోట్ల 30-40 శాతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీరెందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు?
మొక్కజొన్న రైతులు అన్యాయమైపోతుంటే చూస్తూ ఎందుకు కూర్చున్నారు. బత్తాయి రైతులు సర్వనాశనం అయిపోయారు. మార్కెట్ లో కనీస ధరకు కూడా అడిగే పరిస్థితి లేదు. చివరకిరైతులు బత్తాయి తోటలను తెలిగిస్తున్నారు. ఉల్లి రైతులైతే పంట తొలగిస్తున్నారు. తీత ఖర్చులు కూడా రావు. అరటి పంట విషయంలో ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ధర లేదు అంటే ఢిల్లీలో ఉన్న వ్యాపారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా రైతుల దగ్గర అరటి కొనండని బ్రతుమాలుతోంది.
ఇదే అరటి పంటకు కోవిడ్ టైంలో ధరలు పడిపోతే... అరటిని ఎగుమతి చేసే కంపెనీలతో తీసుకొచ్చాం. ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి చేసాం. గూడ్స్ రైళ్లు తీసుకొచ్చి ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించి అరటి పంటను ఎగుమతి చేశాం. మీ హయాంలో అసలు ధరలస్ధిరీకరణ కోసం నిధి లేదూ, ప్రణాళిక కూడా లేదు. రైతన్నా మీ కోసం అని తిరగడానికి సిగ్గనిపించడం లేదా?
అరటి గడిచిన మూడేళ్లలో సగటున వైయస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.25 వేలు పలికితే... ఇప్పుడు టన్ను రూ.500, కేజీ రూ.50 పైసలు పలుకుతోంది. కనీసం కోత ఖర్చులు అయినా వస్తాయా?మీరేమో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి అడిగితే వారు 15 రోజుల తర్వాత వచ్చి కొంటామని చెబుతున్నారంట. ఈలోగా కాయ పండిపోయి కుళ్లిపోవడం ఖాయం. ఇదీ రైతన్నా మీకోసం అని మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమం.
ధాన్యం మద్ధతుధర 75 కేజీలకు మా హయాంలో కన్నా ఇప్పుడు రూ.300-రూ.400 తక్కువ ధరకు కొంటున్నారు. మొక్కజొన్న సగటున గత మూడేళ్లలో రూ.2300 నుంచి రూ.2090 ఉంటే ఇప్పుడు రూ.1200- రూ.1700 ఉంది. పత్తి ఎంఎస్పీ మా హయాంలో క్వింటాళ్ కి రూ.7020 ఉంటే.. ఈరోజు రూ.4500 నుంచి రూ.5000 ఉంది. వేరుశెనగా మా ప్రభుత్వ హయాంలో 6370 ఉంటే ఇవాళ రూ.4000 నుంచి రూ.4300 ఉంది. వైఎస్ జగన్ ముఖ్యంత్రిగా ఉన్నప్పుడు వరికోత యంత్రాల అద్దెలను కూడా నియంత్రించాం. గంటకు రూ.2500 ఉంటే ఇప్పుడు రూ.4000- రూ.4500 వసూలు చేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.
గత 18 నెలలుగా రైతులు ఇంత ఇక్కట్లు పడుతుంటే రైతన్నా మీ కోసం నేనున్నాను అని నిలబడిన నాయకుడు ఒక్కడు లేడు. ఇవాళ మీరు స్లోగన్లు ఇస్తుంటే ఖర్మ కాకపోతే మరేంటి? చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మార్కెటింగ్ తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లేదు. 18 నెలల కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మీరు డేటా చెప్పగలరా? ఎంతమందికి సాయం చేశారో చెప్పగలరా? ఎందుకు ఈ డేటా చెప్పడం లేదు? ఏ రోజు పత్రికలు తిరగేసినా ఎంతమంది రైతులు బలవన్మరణం పొందారో రాస్తున్నారు. అయినా చీమకుట్టినట్లైనా లేదు.
ఇక కౌలురైతులను పూర్తిగా గాలికొదిలేశారు. ఎన్నికల ముందు వైయస్.జగన్ ప్రభుత్వంలో అయితే కేంద్రంతో కలిపి రూ.13,500 ఇస్తున్నారు.. నేను అయితే అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడిసాయంగా రూ.20వేలు కేంద్రంతో సంబధం లేకుండా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకు రూ.40వేలు ఇవ్వాలి.
కానీ ఇప్పటివరకు కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ అనుకూలంగా మర్చిపోయారా? గుర్తుందా? వారికి ఎందుకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతే మీరు వేసిన లెక్కల ప్రకారమే రూ.600 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఈ 18 నెలల కాలంలో దాన్ని ఎందుకు చెల్లించలేదు?. రైతన్నా మీ కోసమే అని స్లోగన్ చెబుతూ.. మీరు రైతులకు చెల్లించాల్సింది ఎందుకు ఇవ్వడం లేదు?
అబద్దపు ప్రచారాలు- రైతుకు అందని చిల్లిగవ్వ సాయం
ఒక వైపు రైతులు చితికి పోతుంటే... మరోవైపు అన్నదాత సుఖీభవ అని మీరు దీవిస్తుంటే ప్రజలు అర్దం చేసుకోలేరా? మీ పంచ సూత్రాలు పచ్చి అబద్దాలు. వ్యక్తిగత ప్రచారాలు, డ్రామాలకే మీరు పరిమతమవుతున్నారే తప్ప.. రైతుల కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పగలరా? ఆ రోజు వైస్.జగన్ ప్రభుత్వం కన్నా మిన్నగా మేము ఇది చేశామని చెప్పగలరా? అరటి పంటనే తీసుకుంటే మీరెంత సాయం చేశారు? మేమేం చేశామో తెలుస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ అరటి రైతులను పరామర్శించి వారికి అండగా నిలబడనున్నారు.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం, కందులు, పెసలు, ఉల్లి, మిర్చి, పెసలు, పొగాకు, అరటి, సజ్జలు, కోకో, చీనీ, మామిడి ఇలా ఎవిరిని తీసుకున్నా... ఒక్క రైతుకూ చేయూతనివ్వని, ఒక్క రైతునీ నిలబడ్డనీ మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది?ఆ హక్కు మీకెక్కడుంది. ఏ వర్గం మీ పాలనలో ఆనందంగా లేదు. వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఎవ్వరూ మీ ప్రభుత్వంలో ఆనందంగా లేరు.
ఉచిత పంటల బీమా రద్దు, సున్నా వడ్డీకి ఎగనామం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రకృతి విపత్తుల కన్నా రైతులకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే నష్టమే ఎక్కువగా ఉంది. మామిడి పంట తీసుకుంటే... మామిడి రైతులకు డబ్బులిస్తామని ప్రకటించారు. ఇవాల్టి వరకు ఒక్క రూపాయి వాళ్ల అకౌంట్లో వేస్తే చూపించండి. మామిడి రైతుల కోసం కర్ణాటక, తమిళనాడులో రూ.5 నుంచి రూ.18 వరకు మద్ధతు ధర ఇచ్చింది. ఏపీలో రూ.4 మద్ధతు ధరతో సరిపెట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడేమో ఇంకా లెక్కలు తీస్తున్నామని చెబుతున్నారు. సీజన్ అయిపోయనా... ఇంకా లెక్కల పేరుతో కాకమ్మ కధలు చెబుతున్నారు.
రైతులకి చంద్రబాబు ఇచ్చినన్ని హామీలు ఎవ్వరూ ఇచ్చి ఉండరు. రైతుల నుంచి ఉల్లి పంటను క్వింటాల్లు రూ.1200 కొనుగోలు చేస్తుందని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. దానికోసం చాలా ఖర్చు పెట్టారు. క్వింటాళ్లకు రూ.1200 ఇస్తామని చెప్పి అది అమలైందో లేదో కూడా చూడలేదు. మామిడి పంటకు కేజీ రూ.12 ఇస్తామన్నారు. మిర్చికి క్వింటాళ్లకు రూ.11,781 ఇస్తామన్నారు. ఏ ఒక్కటైనా అమలు చేశారా?. ఏది తీసుకున్నా ఆ రోజుకి పత్రికల్లో హెడ్ లైన్స్ లో ఉండాలన్న తపన తప్ప..ఆ పథకంపైనా కానీ, ఆ కార్యక్రమం పైనా కానీ రైతులకు చేరువ అయిందా? లేదా అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప మరేం లేదు.
ఫెయిలైనా బాబు బుకాయింపు..
చివరికి యూరియా రైతులకు సక్రమంగా సరఫరా లేదు, .. .ఒక బస్తా యూరియా కూడా రైతులకు ఇవ్వడంలో మీరు విఫలమయ్యారు అంటే.. యూరియా వాడితే కేన్సర్ వస్తుందని చెబుతాడు. అన్నం తింటే మీ ఆరోగ్యాలు మటాష్ అయిపోతాడు అంటాడు. పేదవాడి ఐదువేళ్లు నోటిలోకి వెళ్లాని... కిలో రెండు రూపాయలు బియ్యం పథకం చంద్రబాబు మామ ఎన్టీఆర్ గారి ప్రవేశపెడితే.. దాని వల్లఅందరి ఆరోగ్యాలు పోయాయన్నట్టు మాట్లాడుతున్నాడు.
విత్తనాలు అందవు, పురుగుమందులు, యూరియా కూడా అందవు. చంద్రబాబు రైతులతో ముఖాముఖిలో ... డ్రోన్లకు కెమెరాలు ఏర్పాటు చేసి దాని సాయంతో ఏ మొక్కమీద పురుగు ఉందో చూస్తే.. డ్రోన్ ఆ మొక్క మీదే పురుగుమందు పిచకారీ చేస్తుందని చెబుతున్నాడు.ఇంకా చిత్రంగా గాలిని కూడా ఎనలైజ్ చేస్తామని చెబుతున్నాడు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని తీసుకొస్తాడంట. అరటికి రేటు లేదు మహాప్రభో అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తామంటున్నాడు. పండిన ధాన్యం కొనేవాడు లేరంటే... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి కావాలి.. దయచేసి రియల్ ఇంటెలిజెన్స్ వాడండి చంద్రబాబూ.
పండిన పంటకు ధరలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే.. ప్రపంచ మార్కెట్ వేదికగా చేస్తానని చెబుతున్నాడు. అంటే మండీల దగ్గరకు వెళ్లి వ్యాపారులను బ్రతిమాలడమా? ఇదేం ప్రభుత్వం. అసలు మీకేమీ బాధ్యత అనిపించడం లేదా? కోనసీమలో కొబ్బరిరైతులు రేటు పెరిగిందని ఆనందపడేలోపే కొబ్బరి రేటు అనూహ్యంగా పడిపోయింది. అంబాజీ పేట మార్కెట్ లో నెల రోజుల వ్యవధిలో 1000 కాయిలకు రూ.9వేలు ధర తగ్గింది. ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోలేదు. గత నెలలో ఇదే సమయానికి 1000 కాయిలకు రూ.23-రూ.24 వేలు ఉండే ధర... రూ.9వేలు తగ్గిపోయింది. కనీసం నాఫెడ్ కి లేఖ రాసి మా కొబ్బరి కొనండని లేఖ కూడా రాయలేదు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.
మీరు మామిడి రైతులకు కేజీ రూ.4 సబ్సిడీ అదనంగా ఇస్తామన్నారు. ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఎన్ని టన్నులకు ఇచ్చారు? ఆ వివరాలు ఉంటే ఇంటింటికీ వెల్లి చూపించండి. మనుషులతో, ప్రజల ఎమోషన్స్ తో చంద్రబాబురాజకీయం చేస్తున్నారు. తుపాన్ వస్తే అగ్గిపెట్టలు, కొవ్వెత్తులు సరఫరా చేయడం, యోగా డే వస్తే మ్యాట్ లు సరఫరా చేయడం, పుష్కరాలు వస్తే ముక్కులు పెట్టించడం, వరద వచ్చినా, తుపాను వచ్చినా పండగ చేసుకోవడం మీ కలవాటు.
విశాఖ భూసంతర్పణ - భారీ స్కామ్..
ఇక మీ భూముల పందేరం చూస్తే... రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఎకరా రూ.99 పైసలకే కట్టబెడుతున్నారు. దేశ చరిత్రలో రూ.99 పైసలకే ఎకరాలకు ఎకరా పంచిన ప్రభుత్వం మరొక్కటి లేదు. అదేమిటని ప్రశ్నిస్తే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు అని చెప్తారు ఇదో పెద్ద స్కామ్. విశాఖలో భూముల ధారాదత్తం చేయడం ఏమిటి? మీరు అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ నగరం అమరావతిలో భూములు కేటాయించవచ్చు కదా? విశాఖలో భూకంపాలు వస్తాయని, సునామీలు, తుపాన్‌లు వస్తాయని మన పత్రికల్లోను కథనాలు రాశారు కదా? ఇప్పుడు రావా? కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే వస్తాయా? మీ శిల్పి చెక్కిన మహనగరం అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఏ మహానుభావుడు ఎందుకు ముందుకు రావడం లేదు?
వైజాగ్ కే ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్ గా ఉండాల్సిన మీరు వీటన్నింటినీ మీకు ఇష్టం వచ్చిన రేటుకి ధారాదత్తం చేయడమనేది ఏ విధంగా సబబు? వేల కోట్లు ఆస్తులు ఎవరికో అప్పనంగా కట్టబెట్టే మీరు రైతులకు మేలు చేద్దామన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు? రియల్ ఎస్టేట్ కంపెనీలకు రూ.99 పైసలకే ఎకరా ఇచ్చే మీరు.. రూ.99 రూపాయలకు గజం జాగా పేదవాడి ఇంటి స్థలానికి ఇవ్వలేరా? విశాఖపట్నం భూములకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి... కాబట్టి వాటిని నెమ్మదిగా కృష్టార్ఫనం చేస్తున్నారు.
వైఎస్ జగన్.. అడుగడుగునా అన్నదాతలకు అండగా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2024 వరకు చూస్తే ఒక్క ఉచిత పంటల బీమా కిందే రూ.7802 కోట్లు, ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 3262 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా కింది రూ. 34,288 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ దాదాపు రూ.43744 కోట్లు, ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3497 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.2051 కోట్లు, రూ.1380 కోట్లు విత్తన సబ్సిడీ ఇవ్వడంతో పాటు రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి పీడర్లు సామర్ధ్యాన్ని పెంచాం.
అదే విదంగా రూ.8845 కోట్లు మీ విద్యుత్ బకాయిలు తీర్చడంతో పాటు సెనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్, ధాన్యం సేకరణకు రూ.960 మీ బకాయిలు తీర్చాం. మీ విత్తన బకాయిలు రూ.384 కోట్లు తీర్చాం. ఇది కాకుండా పంటల కొనుగోలుకు రూ.7787 కోట్లు ఐదేళ్లో ఖర్చు పెట్టింది. మీ ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు 18 నెలల కాలంలో ఎంత చేశారు? మా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ ఎంత? బడ్జెట్ లో మీ కేటాయింపులెంత? సమాధానం చెప్పండి చంద్రబాబూ అని నిలదీశారు.
కూటమి ప్రభుత్వంలో రైతు పండించిన ఏ పంటైనా రోడ్డు పాలవ్వడం పరిపాటిగా మారిందని, అదే వైయస్.జగన్ ప్రభుత్వంలో కోవిడ్ లాంటి విపత్తులోనూ రైతు పండించిన ప్రతి పంటనూ కొనుగోలు చేయమని చెప్పారు. రైతులకు నష్టం రాకుండా చూడాలని చెప్పారు. అదే మార్కెట్ ఇంటర్ వెన్షన్, అదే రైతుని స్థిరీకరించే పద్ధతని కన్నబాబు తేల్చి చెప్పారు. అలా కాకుండా అశ్వద్ధామ హతహ్ తరహాలో రైతన్నా మీకోసం అని గట్టిగా చెప్పి... మనసులోపల ఏమీ చేయలేమన్నదే చంద్రబాబు నిజస్వరూపమని తేల్చి చెప్పారు.


