సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాకతో పులివెందుల జనసందోహంగా మారింది. భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను’ అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.
పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్.. వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. వారికి భరోసా కల్పించారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు.

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

గోడు వెల్లబోసుకున్న రైతులు
వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని.. వారికి అండగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు.



