అదునులో విత్తనాలు ఇవ్వలేదు.. సీజన్‌కు ముందు పెట్టుబడి సాయం అందించలేదు... అయినా అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే ఎరువులు కరువు.. అప్పు చేసి వారం పది రోజులు దుకాణాల ముందు తిప్పలు పడి ఎరువులు తెచ్చి పంటలు పండించినా... పంట చేతికొచ్చే సమయంలో విపత్తులు అన్నదాతల వెన్నువిరిచాయి. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మాయమాటలతో మోసం చేసింది. ఫలితంగా 18నెలల నుంచి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేదు. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆపద వేళ అండగా నిలవని చంద్రబాబు... ఇప్పుడు ‘రైతు కోసం’ అంటూ సరికొత్త దొంగ జపానికి తెరతీశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మోసానికి... రైతుల కష్టాలకు ప్రతీక ఈ కింది దృశ్యాలు..

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పల్ప్ ఫ్యాక్టరీలు, దళారీలు కలిసి ధరలు భారీగా తగ్గించేయడంతో తిరుచానూరు మండీలో రైతులు పారబోసిన మామిడి కాయలు (ఫైల్)
30 ఏళ్లలో ఏనాడూ ఇంత నష్టం చూడలేదు
నేను 30 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నా. ఏటా నాకు ఉన్న మూడు ఎకరాల మామిడి తోటకు రూ.70వేల వరకు పెట్టుబడి పెడతాను. ఎకరానికి 5 టన్నుల వరకు మామిడి దిగుబడి వచ్చేది. మూడు ఎకరాలకు 15 టన్నులు విక్రయిస్తే సుమారు రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చేది. గతేడాది టన్ను రూ.4వేలు కూడా పలకలేదు. మామిడి దిగుబడి పల్ప్ ఫ్యాక్టరీలకు తోలేందుకు కూడా గిట్టుబాటు కాలేదు. చేసేదేమి లేక మూడు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లను పూర్తిగా కొట్టేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది.
– దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా
క్వింటా రూ.200లకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోనే రైతులు పడేసిన ఉల్లిపాయలు (ఫైల్)
చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు
ఈ ఏడాది ఖరీఫ్‌లో రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. సాగు ఖర్చులు రూ.1.50 లక్షలు అయ్యాయి. ఉల్లి పెరికి గడ్డలు కోయడానికి ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరాకు 40 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు క్వింటా ఉల్లి రూ.200 నుంచి రూ.300కు కొంటామని చెప్పారు. క్వింటాలు రూ.300 ప్రకారం అమ్మినా వచ్చేది రూ.12,000 మాత్రమే. ఉల్లిగడ్డలు కోయడానికి, గోతాలకు రూ.40 వేలు ఖర్చవుతుంది. ఉల్లి కోసి అమ్మడం వల్ల మరో రూ.28వేలు ఖర్చవుతుంది. అందువల్లే ఉల్లి పంటను టిల్లర్‌తో భూమిలోనే కలిపేశాను. ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పినా పైసా ఇవ్వలేదు.
– పులికొండ, రైతు, చిన్నహుల్తి గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా 
అరటి ధరలు భారీగా పతనమవడంతో మార్కెట్‌కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు దండగని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామంలో మేకలు, గొర్రెలకు మేతగా వదిలేసిన అరటి గెలలు (ఫైల్)
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
నేను ఏడు ఎకరాల్లో అరటి సాగు చేశాను. పెట్టుబడి కింద రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాను. 140 టన్నులకు వరకు దిగుబడి వచ్చింది. అందులో 20 టన్నులు మాత్రమే కొన్నారు. మిగతాది కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అరటి రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దిక్కుతోచక పంటను వదిలేయాల్సి వస్తోంది. కూలీ ఖర్చులు కూడా దండగే.
– నాగమునిరెడ్డి, కేశవరాయునిపేట, యాడికి మండలం, అనంతపురం జిల్లా

పత్తికి ధర లేకపోవడంతో పల్నాడు జిల్లా పెదకూరపాడులో పత్తిపంటను దున్నేస్తున్న రైతు మాబు(ఫైల్)
భగవంతుడే కాపాడాలి
నా పేరు జూపూడి బాబు. వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశా. మోంథా తుపాను వల్ల పత్తి పూర్తిగా దెబ్బతింది. కేవలం మూడు క్వింటాళ్ల మాత్రమే దిగుబడి వచ్చింది. కూలీల ఖర్చులు కూడా రాలేదు. భూ యజమానికి కౌలు కొంత మాత్రమే చెల్లించా. పూర్తిగా చెల్లిద్దామంటే వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం పత్తి పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇస్తామంది. ఇంత వరకు ఒక్క రూపాయి రాలేదు. అధికారులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. ఏం చేయాలో తోచటం లేదు. ఆ భగవంతుడే కాపాడాలి.
– జూపూడి బాబు, కౌలు రైతు నందలూరు గ్రామం వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా
పొగాకు ధరలు దిగజారిపోవడంతో ఖర్చులకు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ జూన్ 26వ తేదీన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై పొగాకును తగలబెట్టి, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు (ఫైల్)
70 క్వింటాలకు ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారు
నేను గత సీజన్‌లో నాలుగున్నర ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేశా. 70 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. రైతు భరోసా కేంద్రంలో నా దగ్గర అమ్మకానికి 70 క్వింటాళ్లు ఉన్నట్లు రాయించా. నా పేరుతో 20 క్వింటాలు కొనుగోలు చేస్తామని మెసేజ్ వచ్చింది. ఎంతో ఆశతో 20 క్వింటాలు తీసుకొని కొనుగోలు కేంద్రానికి వెళితే ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారు. ఆకు బాగా లేదంటూ తిప్పి పంపారు. ఆకు మంచిది అయినా కొనలేదు. అధికార పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల దగ్గర నాసిరకం ఆకు కూడా కొన్నారు.
– కాసు సుబ్బారెడ్డి, పొగాకు రైతు, పావులూరు గ్రామం, ఇంకొల్లు మండలం, పర్చూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లా
మార్కెట్‌లో 25 కిలోల బాక్సు రూ.100కు కూడా కొనుగోలు చేయడం లేదని పొలాల్లోనే పశువులకు వదిలేసిన టమాటా పంట (ఫైల్)
అప్పులే మిగిలాయి
రెండు ఎకరాల్లో టమాట సాగు చేశా. పెట్టుబడికి రూ.70 వేలకు పైగా ఖర్చు అయ్యింది. దిగుబడి బాగా రావడంతోపాటు కాయలు కూడా నాణ్యతతో ఉన్నాయి. మంచి ధర వస్తే అప్పులు తీరిపోతాయని, కాస్త డబ్బులు చేతికి వస్తాయని ఎంతో ఆశించా. సెపె్టంబర్ 15వ తేదీ ప్యాపిలి టమాటా మార్కెట్‌కు సరుకును తీసుళ్లగా, 25 కిలోల బాక్సు కేవలం రూ.100కి తీసుకున్నారు. రూ.70 వేలు ఖర్చు చేస్తే కేవలం రూ.10 వేలు చేతికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టమాటా రైతులను ఏమాత్రం ఆదుకోలేదు.
– రామాంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లా
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మార్కెట్‌లో ధర లేకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో రోడ్డు పక్కనే ఆరబెట్టిన మొక్కజొన్న పంట (ఫైల్)
నాడు ఎరువులు అందక... నేడు పంటను కొనక..
ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.20 నుంచి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టాను. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించలేదు. అయినా అష్టకష్టాలు పడి పంటలు సాగు చేశా. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను మోంథా తుపాను తడిసి ముద్దచేసింది. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్నకు రెండు రోజుల్లోనే మొలకలు వచ్చాయి. మార్కెట్‌లో కొనేవారు లేక, ప్రభుత్వం సాయం అందక అల్లాడుతున్నాం.
– దూదేకుల మస్తాన్, గడివేముల, నంద్యాల జిల్లా

తోటలే కొట్టేస్తున్నారు 
ప్రస్తుతం చీనీ(బత్తాయి) కాయలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో చీనీ తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం చీనీకి పెట్టుబడి పెరిగిపోయింది. కానీ మార్కెట్‌లో మాత్రం గిట్టుబాటు ధర లేదు. ఒక్కసారిగా ధర తగ్గిపోతుండడం, పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఇప్పటికే చాలామంది ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల తోటలను కొట్టేస్తున్నారు.
– సుదర్శన్‌రెడ్డి, కోమటికుంట్ల గ్రామం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా
పెట్టుబడి ఖర్చులూ రాలేదు

ఈ ఖరీఫ్ సీజన్‌లో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ 1010 రకం వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 వేలు చొప్పున సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట దెబ్బతిని 27 పుట్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అయినా 1010 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెప్పడంతో దళారులకు పుట్టి రూ.14,500 లెక్కన అమ్ముకోవాల్సి వచ్చింది. కౌలుకు కొంత ధాన్యం ఇవ్వగా 17 పుట్లు అమ్మాను. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు.
– గురించర్ల వెంకటరమణారెడ్డి, మనుబోలు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
సాక్షి నెట్‌వర్క్


