
రక్షణ కరువు
ఆక్రమించుకుని సీఎం, లోకేష్ ఫొటోలు ఏర్పాటు
రాజకీయ అండతో దౌర్జన్యం
తిరుపతిలో టీడీపీ నేత ఆక్రమణలపై
ఎన్‌ఆర్‌ఐ ఆగ్రహం
ఎన్‌ఆర్‌ఐల భూములకే
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వంలో ఎన్‌ఆర్‌ఐలకు చెందిన భూములు, స్థలాలకు రక్షణ కరువైందని డాక్టర్ సునీత ఆరోపించారు. ఆక్రమించిన భూముల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆధారాలతో బయటపెట్టారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌ఆర్‌ఐకి చెందిన డాక్టర్ సునీత మాట్లాడుతూ.. 2003లో తిరుపతి నగర పరిధిలోని కై కాల చెరువు వద్ద వేసిన ప్రగతి నగర్ వెంచర్‌లో సర్వే నంబర్1లో కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు అందుకు సంబంధించిన పత్రాలను విలేకరుల ముందు బయటపెట్టారు. తాము కొనుగోలు చేసిన కొంత కాలం తరువాత ఈ ప్లాట్లు తమవే నంటూ టీడీపీ నేత, బాలాజీ టింబర్ డిపో అధినేత కంచి రాము ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారని వెల్లడించారు. ప్లాట్లకు దారి లేకుండా ప్రహరీ గోడ, తాత్కాలిక షెడ్లు నిర్మించాడని వివరించారు. ఆ తరువాత సర్వే నంబర్ 1/1బి పేరుతో రికార్డులు సృష్టించుకున్నట్లు ఆరోపించారు. ఆ సర్వే నంబర్లను రద్దు చేశారని, ఆ తరువాత రోడ్ల కోసం వదిలిన స్థలాల పేరుతో రూ.60 కోట్లు విలువచేసే టీడీఆర్ బాండ్లు తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ నేత రాము సృష్టించిన సర్వే నంబర్ బోగస్ అని రెవెన్యూ అధికారులే చెబుతున్నారన్నారు. గతంలో జేసీగా పనిచేసిన బాలాజీ సైతం ఆ భూమి తమకు చెందినదేనని జడ్జిమెంట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తమ ప్లాట్లు ఆక్రమించాడని గత ఏడాది తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమలను బెదిరిస్తూ భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియాకు చెందిన సునీతకు అన్యాయం జరిగిందని సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పినా ఇంత వరకు న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐలకు చెందిన భూములకు రక్షణ కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికినా.. ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన స్థలంతో పాటు పరిసర ప్రాంతంలోని అనేక మంది టీడీపీ నేతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. అయినా ప్రభుత్వం అతడిపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షణ కరువు