
ఉపాధి పనులపై విచారణ
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024 – 2025 ఏడాదిలో పూర్తి చేసిన పనులపై మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం 19వ విడత బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణకు డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ విచారణ అధికారిగా హాజరయ్యారు. సామాజిక తనిఖీల్లో భాగంగా పేరూరు చెరువుకు సంబంధించి రూ.1.50 కోట్లు మేరకు గుంతలు తీసినట్టుగా బిల్లులు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. సమగ్ర విచారణ చేసి పది రోజుల్లో నివేదికను సమర్పించాలని ఎంపీడీఓ రామచంద్ర, ఏపీడీ రెడ్డెప్ప విజిలెన్స్ అధికారులను పీడీ ఆదేశించారు. అలాగే దుర్గసముద్రం పరిధిలో ఒక్క కూలీ కూడా పనులు చేయకుండానే 57 మంది పనులకు హాజరైనట్టుగా నమోదు చేయడం జరిగిందని, దానిపై కూడా విచారణ చేయాలని ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి కోరగా దానిపై శాఖా పరమైన విచారణ చేయాలని ఎపీఓ జ్యోతిశ్రీని ఆదేశించారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లు చేసిన తప్పిదాలు బయటకు రావడంతో వారి నుంచి రూ.48 వేలు వరకు రికవరీ చేయాలని ఆదేశించారు. పెరుమాళ్లపల్లికి చెందిన ఫీల్డు అసిస్టెంట్ పుష్పవల్లి పని చేయలేకుంటే ఆమె చేత రాజీనామా తీసుకుని వేరొకరికి అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ విడుదల మాదవరెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, ఏపీడీ రెడ్డెప్ప, డీఆర్‌డీఓ ప్రభావతి, ఎస్‌ఆర్‌పీ లోకేష్, ఎపీఓలు జ్యోతిశ్రీ, మమత, టెక్నికల్ అసిస్టెంట్ హరి పాల్గొన్నారు.