
ధర్నాతో దద్దరిల్లిన ఎస్వీయూ
తిరుపతి సిటీ : ఎస్వీయూలో తొలగించబడిన తాత్కాలిక అధ్యాపకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి వర్సిటీ అధికారుల తీరును ఎండగట్టారు. అధ్యాపకులు నిరసన కార్యక్రమానికి విద్యార్థి సంఘాల నాయకులు హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా తొలగించిన అధ్యాపకులు మాట్లాడుతూ.. అన్ని అర్హతులు ఉన్నా కక్ష సాధింపు చర్యలో భాగంగా వర్సిటీ అధికారులు 43 మంది అకడమిక్ కన్సల్టెంట్లను తొలగించి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకమండలిని మభ్యపెట్టి....
పాలక మండలికి అకడమిక్ కన్సల్టెంట్ల తొలగింపుపై పూర్తి సమాచారం ఇవ్వకుండా చర్చించకుండా ఇంటర్వ్యూలు నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఓ పాలకమండలి సభ్యురాలు తనకు అవగాహన లేకపోవడంతో ఆమోదం తెలిపానని బహిరంగంగా వీసీకి లేఖ రాశారంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అనంతరం వీసీ అప్పారావును కలసి వారు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కల్లూరి కిషోర్‌కుమార్‌రెడ్డి, సభ్యులు, వైఎస్సాఆర్‌సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రవి, వినోద్, ఉపాధ్యాక్షులు అశోక్, బీడీవీఎస్ నాయకులు యుగంధర్, సుకుమార్, విద్యార్థి సంఘాల నాయకులు ముని హేమంత్, భరత్, తాత్కాలిక అధ్యాపకులు పాల్గొన్నారు.
న్యాయపోరాటానికి సన్నద్ధం
వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక అధ్యాపకులను తొలగించడంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేశాం. న్యాయవాదుల సలహాలు తీసుకున్నాం. ఈ విషయంపై వెనకడుగు వేసేదేలేదు. డిప్యూటీ సీఎం దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. – తొలగించిన తాత్కాలిక అధ్యాపకులు, ఎస్వీయూ