
పాదయాత్రకు పోలీసు నిర్భందం
ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టు నుంచి బయటపడాలని అభిమానుల పాదయాత్ర
పాదయాత్రను అడ్డుకుని స్టేషన్‌లో
నిర్భంధించిన పోలీసులు
పోలీసుల తీరుతో శ్రీవారిమెట్టు వద్ద భయబ్రాంతులకు గురైన భక్తులు
డీఎస్పీ ప్రసాద్ మీడియాపై ఆంక్షల పేరుతో చిందులు
చంద్రగిరి : శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై చంద్రగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు నుంచి త్వరగా బయటకు రావాలని, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులు మంగళవారం శ్రీవారిమెట్టు వద్ద అడ్డుకున్నారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు వెళ్తున్న వారిని అక్రమంగా అడ్డుకోవడంతో పాటు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అభిమానులను ఈడ్చుకొంటూ స్టేషన్‌కు తరలించారు. దీంతో తిరుమలకు వెళ్తున్న భక్తులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సుమారు 4 గంటల పాటు స్టేషన్‌లో..
పాదయాత్ర చేస్తున్న హరిప్రసాద్ రెడ్డితో పాటు సుమారు 17 మందిని చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్‌లోనే అక్రమంగా నిర్భంధించారు. హరిప్రసాద్ రెడ్డిను అరెస్టు చేశారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీగా పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
చంద్రగిరి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అరాచక పాలన
సుమారు 4 గంటల పాటు పోలీసు స్టేషన్‌లో నిర్భంధించిన నేతలను పోలీసులు సొంత పూచీకత్తుపై రాత్రి విడుదల చేశారు. తిరుమల పాదయాత్రలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేసి, విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ చైర్మన్ ఆదేశాలతోనే అక్రమంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటంటూ మండిపడ్డారు. తిరుమలకు వెళ్లాలంటే కూటమి ప్రభుత్వంలో పాస్‌పోర్టు, వీసా కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు.
చంద్రగిరిలో ఉద్రిక్తత..!
మీడియాపై డీఎస్పీ చిందులు
వైఎస్సార్‌సీపీ శ్రేణుల అక్రమ అరెస్టు తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్‌లోకి ఎలా వస్తారంటూ చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ చిందులు వేశారు. జర్నలిస్టుగా వచ్చామని, అరెస్టుకు సంబంధించి వివరాలు తెలపాలని కోరడంతో ఆయన ఆంక్షల పేరుతో చిందులు వేయడంపై పాత్రికేయులు మండిపడ్డారు.

పాదయాత్రకు పోలీసు నిర్భందం

పాదయాత్రకు పోలీసు నిర్భందం

పాదయాత్రకు పోలీసు నిర్భందం