
● మా పొట్టలు కొట్టొద్దు
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ మా పొట్టలు కొట్టడం న్యాయమేనా’ అంటూ చిట్టమూరు మండలంలో సోమవారం ఆటోడ్రైవర్లు నిరసన తెలిపారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో సోమవారం ఆటోడ్రైవర్లు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ పల్లె వెలుగు బస్సులను ప్రవేశ పెట్టారని, దీనివల్ల పల్లెల్లో ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే ఆటోవాలాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లకు ఏడాది రూ.10 వేలు ఇచ్చేవారని, ప్రస్తుతం అది కూడా లేకపోవడంతో తమ బతుకులు దుర్భరంగా మారాయని వాపోయారు. ప్రభుత్వం ఆటో వాలాలపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. – చిట్టమూరు