
అక్రమ అరెస్ట్‌లతో అణగదొక్కలేరు
భాకరాపేట : అక్రమంగా అరెస్ట్ చేసి వైఎస్సార్‌సీపీ నేతలను అణగదొక్కలేరని, పెద్దిరెడ్డి కుటుంబీకులను భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా, పెద్దిరెడ్డి కుటుంబానికి సంఘీభావంగా సోమవారం పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన ఆత్మసంతృప్తి కోసమే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేక ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి కుంగదీయాలనుకోవడం హాస్యాస్పదమని తెలిపారు. ఈ వేధింపులకు పెద్దిరెడ్డి ఏమాత్రం భయపడరని, మరింత ఉత్సాహంగా పనిచేస్తారని వెల్లడించారు.
మందుల విక్రయానికి ప్రత్యేక రిజిస్టర్
చిల్లకూరు : మెడికల్ షాపు యజమానులు మందుల విక్రయానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని, ప్రధానంగా వైద్యులు సూచించిన మత్తు ఇచ్చే మెడిసిన్‌ల వివరాలను నమోదు చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శాంతి ఆదేశించారు. సోమవారం గూడూరులోని సీఆర్‌రెడ్డి కల్యాణ మండపంలో మందుల షాపుల యజమానులు, ఏరియా ఆస్పత్రి వైద్యులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మందు షాపుల యజమానులు మత్తు కలిగించే వాటిని కొనుగోలు చేసే సమయంలో పక్కాగా రశీదులు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్యులు రమేష్, ఎస్‌ఐ షాజహాన్, మందుల షాపు యజమానుల సంఘం అధ్యక్షుడు బత్తిన సుధాకర్, కార్యదర్శి సుభాన్ పాల్గొన్నారు.
దాడి కేసులో ఒకరి అరెస్ట్
చిల్లకూరు : మండలంలోని మోమిడిలో ఈ నెల 7వ తేదీన జరిగిన దాడి కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో మత్స్యకారులకు , ఓ ముస్లిం కుటుంబానికి బోట్ల విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో 8 మంది తమపై దాడి చేశారని ముస్లింలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏడో నిందితుడు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
జర్మనీ భాషపై ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్ : ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచితంగా ఆఫ్‌లైన్‌లో శిక్షణ ఇస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర కులాల వారికి ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 6 నెలల క్లినికల్ అనుభవం, జీఎన్‌ఎం నర్సింగ్ పూర్తి చేసి 2 ఏళ్ల క్లినికల్ అనుభవం గల 35ఏళ్లలోపువారు అర్హులని చెప్పారు.ఆసక్తిగలవారు ఈ నెల 21వ తేదీలోపు పేర్లునమోదు చేయించుకోవాలని కోరారు. ఈనెల 22 నుంచి తొలి బ్యాచ్ ప్రారంభిస్తారని పేర్కొన్నా రు. బైరాగిపట్టెడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 9160912690 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

అక్రమ అరెస్ట్‌లతో అణగదొక్కలేరు