
ఆలస్యంగా వస్తూ!
అలసత్వం వహిస్తూ..
● కలెక్టరేట్‌లో 10గంటలకు గ్రీవెన్స్ ● 12 గంటలకు వచ్చిన అధికారులు ● అర్జీదారులను పట్టించుకోని సిబ్బంది
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కలెక్టర్ హాజరైతే ఒక లెక్క.. ఆయన లేకుంటే ఒక లెక్క అన్నట్లు వ్యహరిస్తున్నారు. తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఆలస్యంగా వచ్చారు. ఇదే అదునుగా ఉన్నతాధికారులు సైతం వినతుల స్వీకరణకు నింపాదిగా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు గ్రీవెన్స్ మొదలైతే మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే 12.15 గంటలకు కలెక్టర్ వచ్చేసరికి మాత్రం జిల్లా అధికారులందరూ హాజరుకావడం గమనార్హం. కలెక్టర్ లేరని అధికారులు ఆలస్యంగా రావడంపై అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా కనీస వసతులు సైతం కల్పించకుండా కలెక్టరేట్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని వాపోయారు. దాహంతో అలమటిస్తున్నప్పటికీ తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వినతుల వెల్లువ
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 238 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రతి వినతిని నిశితంగా పరిశీలించి, పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 72 అర్జీలు
తిరుపతి క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌న్‌రాజు తెలిపారు. ఆయా అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆలస్యంగా వస్తూ!