
తిరుపతి అర్బన్: తిరుపతి బస్టాండ్ నుంచి ఉచిత బస్సులు సరిపడా లేకపోడంతో ప్రయాణికులు గంట నుంచి రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. పల్లెవెలుగు, ఆల్ట్రాపల్లె వెలుగు, సాధారణ ఎక్స్‌ప్రెస్‌ల్లో ఉచిత ప్రయాణానికి అవకాశముండడంతో మహిళలు వీటికే మొగ్గుచూపుతున్నారు. 54 నుంచి 56 సీట్లు ఉన్న ఆ మూడు సర్వీసుల్లో 70 మందికి పైగానే ఎక్కేస్తున్నారు. దీంతో సీట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. కిటికీల్లో నుంచి సీట్ల కోసం బస్సులోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు అత్యవసరం అయితే తప్ప రెండు వారాలు పాటు సెలవులు పెట్టడానికి వీలు లేదని జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అలాగే సెలవుల్లో ఉన్న ఉద్యోగులు సైతం డ్యూటీలకు రావాలని స్పష్టం చేశారు. మొత్తంగా ఆర్టీసీ అధికారులు ఉచిత బస్సులపైనే ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తుంది.
మాకు ఉచితం లేదా
ఆధార్ కార్డులు లేకపోతే ఉచిత ప్రయాణం కుదరదని మా ముగ్గురి వద్ద రూ.100 చొప్పున కండక్టర్ రూ.300 రూపాయలు టికెట్ కొట్టారు. స్మార్ట్ ఫోన్లులో ఉన్న ఆధార్ కార్డులను చూపినప్పటికీ ఇవి చెల్లవంటూ బస్ కండక్టర్ టికెట్ కొట్టి చేతిలో పెట్టారు.
– సరయు, తన్మయి, లహరి, ఇంజినీరింగ్ విద్యార్థులు
విద్యార్థినులకు చేదు అనుభవం
దొరవారిసత్రం : సీ్త్రశక్తి పేరిట మహిళలకు ఆర్‌టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఆ వెసులుబాటును కొన్ని సర్వీసులకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే పలు నిబంధనలను సైతం విధించింది. ఈ క్రమంలోనే సోమవారం నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్లే గూడూరు డిపోకు చెందిన (ఏపీ40జెడ్0479) ఎక్స్‌ప్రెస్ బస్సులో విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులు బస్సు ఎక్కిన తర్వాత స్మార్ట్ ఫోన్లలో ఆధార్ కార్డులను చూపినప్పటికీ కండక్టర్ ససేమిరా అన్నారు. ఒరిజినల్ ఆధార్ చూపిస్తేనే ఉచితమని కండక్టర్ చెప్పడంతో ఆ విద్యార్థులు విధిలేని పరిస్థితిలో టికెట్లు తీసుకోకతప్పలేదు.
ఫోన్‌లో చూపినా చాలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వచ్చేవరకు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళా ప్రయాణికులు చేతిలో ఆధార్ ఉన్నా లేకపోయి సెల్‌ఫోన్‌లో చూపి ప్రయాణం చేయొచ్చు. అన్ని డిపోల్లోని కండక్టర్లకు దీనిపై అవగాహన కల్పించాం.
– జగదీష్, ఆర్టీసీ ఆర్‌ఎం, తిరుపతి