
కలెక్టర్‌కు సత్యవేడు ఎమ్మెల్యే ఫిర్యాదు
తిరుపతి అర్బన్: ‘నేను ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎన్నికైన సత్యవేడు ఎమ్మెల్యేని. నన్ను అధికారులు గౌరవించాలి. ముందుగా ప్రొటోకాల్ పాటించడం నేర్చుకోవాలి’ అంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో సాధారణ అర్జీదారుడిలా ఓ అర్జీలో తన సమస్యలను రాసి కలెక్టర్‌కు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏదైనా ఓ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత.. మళ్లీ తమ పార్టీకి చెందిన నాయకులే ప్రారంభోత్సవం చేయడం బాధగా ఉందని వాపోయారు. అలాగే ప్రైవేటు కార్యక్రమాలకు మండలానికి చెందిన నేతలు వెళితే.. వారికి అధికారులు ప్రొటోకాల్ పాటించడం సరికాదన్నారు. తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. వర్గాలుగా చీలిపోయి పనిచేయడం ద్వారా నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.