తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్‌ | Social Activists Over Action Reels At Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్‌

Oct 8 2025 7:18 AM | Updated on Oct 8 2025 8:47 AM

Social Activists Over Action Reels At Tirumala

టీటీడీకి చెందిన వారి ద్వారా మాడవీధుల్లోకి ప్రవేశం

అసభ్యకరంగా తీసిన రీల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌  

సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్‌ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్‌ మీడియాలో(Social Media Reels) హల్‌చల్‌ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్‌ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్‌ చేశారు. ఈ వీడియోను తన సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్‌ చేయడం కూడా వైరల్‌గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్‌ మీడియా వారితో కలిసి రీల్స్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్‌ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్‌లో చెప్పుకొచ్చారు.

గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్‌ చేస్తున్న యువతి వీడియో వైరల్‌ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్‌ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్‌ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement