
సాక్షి, తిరుపతి: శ్రీవేంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తీరని ద్రోహం చేస్తున్నారని.. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈవో వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్దకర్మకు వెళ్లి బీఆర్ నాయుడు పరామర్శించిన తీరు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామంపై సోమవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ..
‘‘బీఆర్ నాయుడి మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కానీ, ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకంగా ఉంటోంది. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారు. పరివట్టం కట్టి, లడ్డూ శ్రార్దకర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారు. శ్రార్దకర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటీ?. ఎప్పుడు ఎలా ఉండాలో.. ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడికి తెలియదు. వధువు, విదవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు’’ అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
.. ప్రసాదాల దిట్టం పెంచడం లేదని ఎల్లో మీడియాలోనే వార్త వచ్చింది. రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి స్వామివారిని వాడుకుంటున్నారు. జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రభస చేశారు. మరి ఆ సంస్థలో బీఆర్ నాయుడు భాగస్వామిగా ఉన్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు ద్రోహం చేస్తున్నాడు. ఆలయ పవిత్రతతను ధ్వంసం చేస్తున్నారు. అర్హత లేనివారికి అధికారమిస్తే అర్థరాత్రి గొడుగు పట్టకోమన్నాడట.. అలా ఉంది బీఆర్ నాయుడి తీరు అని భూమన ఎద్దేవా చేశారు.

వైసీపీ పోరాటం వల్లే..
ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే(AP Liquor Mafia). కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన నేతలు ఈ దందాను నడిపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు పల్లెపల్లెకూ పంపించారు. ప్రతిచోటా ఏదో కుటీర పరిశ్రమలా.. నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైగా లిక్కర్ కేసు అంటూ మాపై అసత్య ప్రచారం చేశారు. మా నేతలను జైల్లో పెట్టారు. చివరకు మా పోరాటం వల్లే ములకలచెరువు మద్యం ఇష్యూ బయటపడింది అని భూమన అన్నారు.