
ఉచిత బస్సు ఉత్తర్వులు జారీ
జిల్లాలో మొత్తం సర్వీసులు 855
అందులో 356 సర్వీసుల్లో మాత్రమే అనుమతి
నాన్‌స్టాప్ సర్వీసులకు నో చాన్స్
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, తిరుమలకు అవకాశం లేదు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఈనెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. సీ్త్రశక్తి పేరుతో కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రాపల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో సర్వీసులు, సిటీ సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక జిల్లాలో మెట్రో సర్వీసులు, సిటీ సర్వీసులు లేకపోవడంతో మూడు రకాల సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
వీటిల్లో అనుమతి లేదు
జిల్లాలో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లే అధికం. వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. అంతేకాకుండా తిరుమలకు వెళ్లే సర్వీసుల్లోనూ, నాన్ స్టాప్ సర్వీసుల్లో, ఏసీ బస్సులతో పాటు ఇతర సర్వీసుల్లో అనుమతి లేదు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 855 సర్వీసులు ఉండగా.. వాటిల్లో 356 సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అందులో పల్లెవెలుగు 274, సాధారణ ఎక్స్‌ప్రెస్‌లు 77, అల్ట్రా పల్లెవెలుగు 5 సర్వీసులకు మాత్రమే అనుమతిచ్చారు.
జిల్లాలో 16.5 లక్షల మంది మహిళలు
జిల్లాలో 16.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం 356 సర్వీసులకు అనుమతిచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రం ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. తీర 14 నెలలు తర్వాత పథకాన్ని అమలు చేసే క్రమంలో అనేక మెళికలు పెట్టారు. దీంతో మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
15 నుంచి అమలు చేస్తున్నాం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సీ్త్రశక్తి పేరుతో అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు డీఎంలతో సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చాం. జిల్లాలో 356 బస్సులకు మాత్రమే అనుమతి ఉంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సాధారణ ఎక్స్‌ప్రెస్‌లకు అవకాశం కల్పిస్తున్నాం. మరోవైపు పాఠశాలకు వెళ్లే బాలికలు ఇకపై బస్సు పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారికి పైన తెలిన మూడు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది.
– జగదీష్, జిల్లా ప్రజారవాణా అధికారి

కొన్నింటికే ఉచితం!