
ఓటమిని లెక్క చేయని నాయకుడు తాటిపర్తి
● సుదీర్ఘకాలం రాజకీయ జీవితం గడిపిన నేత ● 1988లో జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపు ● కేవలం సంవత్సరమే ఎమ్మెల్యేగా పని చేసిన తాటిపర్తి చెంచురెడ్డి ● నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేతలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి(88) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన తాటిపర్తి.. పలు పర్యాయాలు వరుసగా ఓటమి పలకరించినా నిరుత్సాహ పడకుండా పోరాడారు. 1988లో జరిగిన ఉప ఎన్నికలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండుగారి శ్రీరామమూర్తిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ ఐ అభ్యర్థి ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు చేతిలో ఓడిపోయారు. 1983లో కాంగ్రెస్ ఇండిపెండెంట్ మధ్య త్రిముఖ పోరు జరగడంతో కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా అధిక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సత్రవాడ మునిరామయ్య చేతిలో కేవలం 80 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే సత్రవాడ మునిరామయ్య ఎంపిక చెల్లదని, ఆయన ఓ రైల్వే కాంట్రాక్టర్ అంటూ కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించారు. దీంతో కోర్టు సత్రవాడపై అనర్హత వేటు వేయడంతో 1988లో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ నుంచి కొండుగారి శ్రీరామమూర్తి ఉప ఎన్నిక బరిలో నిలబడగా, కాంగ్రెస్ నుంచి యథావిధిగా తాటిపర్తి పోటీపడ్డారు. టీడీపీ తరఫున ఎన్టీ రామారావుతో పాటు సినీ ప్రముఖులు శ్రీకాళహస్తిలో పెద్దఎత్తున ప్రచారం చేయగా, కాంగ్రెస్ తరఫున సూపర్‌స్టార్ కృష్ణ, జమున లాంటి వాళ్లు ప్రచారం చేశారు. టీడీపీ, ఎన్‌టీఆర్ హవా కొనసాగుతున్న సమయంలోనే ఉప ఎన్నిక రావడం.. చెంచురెడ్డి గెలవడం జరిగిపోయింది. 1989లో మళ్లీ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. చెంచురెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూద్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ ఎంపీ చింతామోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చెంచురెడ్డి మృతికి ఎంపీ గురుమూర్తి సంతాపం
తిరుపతి మంగళం:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియో జకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి మర ణం పట్ల తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి విచా రం వ్యక్తం చేశారు. ఆయన మృతి శ్రీకాళహస్తికి తీర ని లోటని గురుమూర్తి అన్నారు. సామాన్య ప్రజల కు అండగా నిలిచి, నియోజకవర్గ అభివృద్ధికి చెంచు రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అందుకే ప్రజల మనసుల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.