పంచాయతీలు వెలవెల
15వ ఆర్థిక సంఘం నిధులకు ఎదురుచూపులు
పది నెలలుగా అవస్థలు పడుతున్న అధికారులు
పారిశుద్ధ్య పనులకు నిధుల కొరత
రెండు విడతల నిధుల విడుదల ఎప్పుడో?
పంచాయతీల అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రస్తుతం సర్పంచులుగా ఉన్న వారు పూర్తిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కావడంతో వివక్ష చూపుతోంది. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టిస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహణ భారంగా మారుతోంది. కనీస అవసరాలైన తాగునీరు, వీధిలై ట్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు.
వరదయ్యపాళెం : కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల్లో కోత పెడుతుండటంతో సర్పంచులు, అధికారులు ఏ పని చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలు 15వ ఆర్థిక సంఘం, స్టాంప్ డ్యూటీ, వృత్తి పన్నుల పైనే ఆధారపడి ఉన్నాయి. పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడంతో వచ్చిన నిధులు పారిశుద్ధ్య కార్మికుల వేతనం, మైనర్ రిపేర్ల ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. కొన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పంచాయతీలో ఏ పని చేయాలన్నా నిధుల కొరతతో ముందడుగు వేయలేకపోతున్నారు.
పెరిగిన నిర్వహణ ఖర్చులు
తిరుపతి జిల్లాలో 34 మండలాల్లో 774 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 9,09,555 మంది జనాభా ఉన్నారు. పంచాయతీల్లో ట్రై సైకిళ్ల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, పైపులైన్ సమస్యలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పారిశుద్ధ్య పనులు పెరిగిపోయాయి. దీంతో చేసిన పనులకే దిక్కులేకుండా పోగా, అధికారులు నిత్యం పంచాయతీలను తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తుండటంతో అదనపు ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు.
అసలే వర్షాకాలం
వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో పంచాయతీల్లో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలు పుట్టుకొస్తాయి. తద్వారా వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వ్యాధుల నియంత్రణకు క్లోరినేషన్ చేయాలి. ఈ పరిస్థితుల్లో పంచాయతీల ఖజానా ఖాళీగా ఉండడంతో సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో సర్పంచులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆదాయ వనరులు ఉండే మేజర్ పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 90శాతం గ్రామ పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతోంది.
పది నెలలుగా నిధుల కొరత
2024–25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులను మొదటి విడత కింద సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేశారు. ఆ నిధులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రెండో విడత నిధులను కూడా కేంద్రం విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయలేదనే విమర్శలున్నాయి. ఒక్కో పంచాయతీలో దాదాపుగా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.25 వేలు ఖర్చు వస్తోంది. ప్రస్తుతం కార్మికులు వేతనం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
స్వాతంత్య్ర వేడుకులకు ఉత్తి చేతులే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే వేడుకలకు నిధులు అందిస్తారని అందరూ భావించగా.. పంచాయతీల నుంచే వాడుకోవాలని జీఓ జారీ చేయడంపై సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకుండా వేడుకలు ఎలా చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
రూ.60 కోట్ల నిధులు పెండింగ్
గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘ నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆ దిశగా తిరుపతి జిల్లాలోని 774 పంచాయతీలకు సంబంధించి ఒక విడతకు రూ. 45 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘ నిధులు జమ కావాల్సి ఉంది. అలాగే వైద్యఆరోగ్యశాఖ నుంచి ఏటా రెండు విడతల్లో పంచాయతీలకు రూ. 10 వేలు చొప్పున మొత్తంగా రూ. 20 వేలు జమ కావాలి. ఈ నిధులు కొన్ని సంవత్సరాలుగా పంచాయతీలకు జమ కావడం లేదు. ఈ విధంగా పంచాయతీలకు రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకుండా పంచాయతీల అభివృద్ధిని కూటమి నీరుగారుస్తోంది.
నిధులు కేటాయించకుండా కాలయాపన
కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తోందని గగ్గోలు పెట్టిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్నదేమిటి?. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించి పంచాయతీల అభివృద్ధిని గాలికొదిలేశారు. – దుడ్డు వేణు, సర్పంచ్, సీఎల్‌ఎన్‌పల్లి
వీధి దీపాల మరమ్మతులకు ఇబ్బందులే..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను పక్కదారి పట్టిస్తుండడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. కనీసం వీధి లైట్ల ఏర్పాటు, పంచాయతీ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నిధులు విడుదల కానిదే ఏ పనులు చేపట్టలేం. – చంద్రారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, వరదయ్యపాళెం మండలం