
డీఎస్సీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు జరిగిన డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టులకు సుమారు 50 వేల మందికిపైగా పోటీపడ్డారు. తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. టెట్ వివరాలకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే విధ్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమకు తామే టెట్ వివరాలను సరిచేసుకునేందుకు ఈనెల 13వ వరకు రెండు రోజుల పాటు వెసులుబాటు ఇచ్చారు.
బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి
ఎంపిక పోటీలు రేపు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో 13వ తేదీ అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ శశిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 13వ తేదీ ఈ పోటీలకు హాజరు కావాలని ఆయన కోరారు.
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
తిరుమల: బెంగళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్‌ఎన్‌వీఎల్ నరసింహరాజు అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధి మోహన్ కుమార్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ కార్యాలయంలో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.