
విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యం
తిరుపతి సిటీ: విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే లక్ష్యంగా నులిపురుగుల మాత్రలు ప్రభుత్వం అందిస్తోందని కలెక్ట వెంకటేశ్వర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం తిరుపతి అర్బన్ కొర్లగుంటలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన 4,97, 511 మంది విద్యార్థులకు ఈ మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పిల్లలకు ఆల్బెండజోల్ మందు బిళ్లలను మింగించడమే లక్ష్యంగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్కూల్ టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. డీఈఓ కేవీఎన్ కుమార్, ప్రోగ్రాం స్టేట్ నోడల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీనివాస వర్మ, డాక్టర్ సౌజన్య లక్ష్మీ, డీపీఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సింధు పాల్గొన్నారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
తిరుపతి రూరల్: ర్యాగింగ్ వల్ల ఎంతోమంది అమాయకులు మానసిక వేదన అనుభవిస్తారని యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.ఉమ తెలిపారు. మంగళవారం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేషనల్ యాంటీ ర్యాగింగ్ డే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీనియర్ విద్యార్థినులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. అంతేకాక ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై తీసుకునే కఠిన చర్యలు ఉంటాయన్నారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఉషారాణి, హాస్టల్ వార్డెన్ ప్రొఫెసర్ జి.సావిత్రి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐవీ లలితకుమారి ర్యాగింగ్ నియంత్రణకు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లీగల్ ఆఫీసర్ ప్రొఫెసర్ టి.సీతాకుమారి మాట్లాడుతూ జూనియర్ విద్యార్థినులకు స్నేహాన్ని పంచి ప్రశాంతమైన వాతావరణంలో వారు చదువుకునేలా అవకాశం కల్పించాలని సీనియర్ విద్యార్థినులను కోరారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ టి.మల్లికార్జున రావు, విద్యార్థినులు పాల్గొన్నారు.
విద్యార్థిని భార్గవికి
అభినందనలు
తిరుపతి రూరల్ : శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర విభాగంలో చదువుతున్న విద్యార్థిని భార్గవి నూకతోటి అమెరికాలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఐదు వారాల శిక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సదస్సుకు హాజరై భారత దేశంలోని చట్టాలు, న్యాయ వ్యవస్థ గురించి సమగ్రంగా వివరించారు. ఈ సదస్సుకు భారతదేశంతో పాటు దక్షిణ కొరియా, శ్రీలంక, మలేషియా, బోస్నియా, హెర్జెగోవినా, జాంబియా, కజకిస్తాన్ నుంచి 19 మంది న్యాయశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. తిరిగి యూనివర్సిటీకి చేరుకున్న విద్యార్థిని భార్గవిని వీసీ ఆచార్య ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య రజినితో పాటు సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషనన్స్ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అభినందించారు. న్యాయశాస్త్ర విభాగాధిపతి, ఫ్యాకల్టీ సభ్యుల ప్రోత్సాహానికి భార్గవి నూకతోటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.