తిరుపతి సిటీ:జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 27 వరకు పొడిగించారు. వరదరాజ నగర్ లోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రంలో దరఖాస్తుల సమాచారం పొందవచ్చని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఇతర వివరాలకు 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రేపు స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
తారకరామా స్టేడియంలో ’జెండా పండుగ’
తిరుపతి అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన జిల్లాస్థాయి వేడుకలను తిరుపతిలోని తారకరామా స్టేడియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జెండా పండుగ జరిగేదని, అయితే వర్షాల నేపథ్యంలో మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
డీవైఈఓగా ఇందిరాదేవి
తిరుపతి అర్బన్ : తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి (డీవైఈఓ)గా ఇందిరా దేవి బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. రేణిగుంట ఎంఈఓగా పనిచేస్తున్న ఆమెకు ఇన్‌చార్జి డీవైఈఓ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తించిన బాలాజీని తిరుపతి అర్బన్ ఎంఈఓ విధులు కేటాయించారు.
జ్ఞానానికి సంస్కృతమే గమ్యం
తిరుపతి సిటీ : జ్ఞాన సంపదకు, సంస్కృతికి గమ్యస్థానం సంస్కృతమేనని కేరళలోని చిన్మయ్ విశ్వ విద్యాపీఠం ప్రో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గీర్వాణి తెలిపారు. బుధవారం జాతీయ సంస్కృత వర్సిటీలో నిర్వహించిన సంస్కృత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గీర్వాణి మాట్లాడుతూ దైవభాషగా వెలుగొందుతున్న సంస్కృతాన్ని నేటి యువత అభ్యసించాల్సిన అవసరముందన్నారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృతంతోనే భారతీయ సంస్కృతి రక్షింపబడుతోందన్నారు. భాష ప్రాముఖ్యతను ఆధునిక సమాజానికి మరింత చేరువ చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ కేవీ నారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ ఎస్.దక్షిణామూర్తి శర్మ, ప్రొఫెసర్ రంగనాథన్, డాక్టర్ భరత్ భూషన్ రథ్, డాక్టర్ ప్రదీప్‌కుమార్ బాగ్ పాల్గొన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తులు
తిరుపతి తుడా: స్విమ్స్ వైరాలజీ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ బిట్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీన స్విమ్స్‌లోని పాత డైరెక్టర్ కార్యాలయంలోని కమిటీ హాల్‌లో వాక్ ఇన్‌ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
పోక్సో చట్టంపై అవగాహన
తిరుపతి రూరల్: బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు, అఘాయిత్యాలను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన పొక్సో చట్టం గురించి శ్రీ పద్మావతీ మహిళా వర్సిటీ న్యాయ శాస్త్ర విభాగం తరఫున అవగాహన సదస్సు నిర్వహించారు. పేరూరులోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు చట్టం గురించి వివరించారు. విశ్వవిద్యాలయ పీఎం ఉష, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కె. అనురాధ, న్యాయశాస్త్ర విభాగాధిపతి డా. సీతాకుమారి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. మాధురి పరదేశి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సునీత కాణిపాకం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.
27 వరకు నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు అవకాశం