
ఓటీపీ లేకుంటే భూ వివరాలు రావంతే..
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా సజావుగా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్న మీ భూమి, భూ నక్షత్ర పోర్టల్‌లో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. గత నెల రోజులుగా కూటమి ప్రభుత్వం మీ భూమి పోర్టల్ లో తెచ్చిన కొత్త మార్పులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సజావుగా సాగుతున్న మీ భూమి పోర్టల్‌కు ఓటీపీ లాగిన్‌ను ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు అధికమవుతున్నాయి. రైతులు, ప్రజలు తమ భూముల వివరాలను మీ భూమి పోర్టల్ లో తెలుసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నప్పటికీ తమ చేతుల్లో ఏమీ లేదంటూ చేతులెత్తేస్తున్నారు.
నెట్ స్పీడు లేకున్నా మొరాయింపే
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న మండలాల్లో నెట్ వేగం అంతంత మాత్రమే. నగరాల్లో మాత్రమే 5 జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో నెట్‌వర్క్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఇంటర్‌నెట్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితి. ఈ క్రమంలో గ్రామాల్లో మీ భూమి వెబ్‌సైట్ లో వివరాలు పొందేందుకు రైతులు ఓటీపీ నమోదు చేశాకే వెబ్‌ల్యాండ్ ఓపెన్ అవుతోంది. నెట్ స్పీడు లేకపోయినా మీ భూమి పోర్టల్ ఓపెన్ అవ్వని పరిస్థితి క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. గ్రామాల్లో మీ భూమి పోర్టల్ లో భూ వివరాలు పొందేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మీ భూమి పోర్టల్‌కు లాగిన్ ఆప్షన్ పెట్టడంతోనే ఈ కొత్త కష్టాలు రైతులకు మొదలయ్యాయి.
పోర్టల్‌లో సమస్యలు
కూటమి ప్రభుత్వం మార్పులు చేసిన మీ భూమి పోర్టల్ లో వింత సమస్యలు ఎదురవుతున్నాయి. గత మీ భూమి పోర్టల్ ను పూర్తిగా తొలగించడంతో అందులోని సమగ్ర వివరాలు మాయమయ్యాయి. ప్రస్తుతం చాలా వరకు భూముల వివరాలు మీ భూమి పోర్టల్ లో కనిపించడం లేదు. ఈ సమస్యలు చిత్తూరు, తిరుపతి జిల్లాలు మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో పోర్టల్ మొరాయింపుతో రైతులకు అవసరమైన భూ పత్రాలు పొందలేక పోతున్నారు. రైతులు తమకు అవసరమైన పత్రాలు సకాలంలో బ్యాంకులలో ఇవ్వలేకపోతుండటంతో రుణాలు పొందలేక నష్టపోతున్నారు. రైతులు నెట్ సెంటర్‌ల వద్ద రోజంతా నిరీక్షిస్తున్నప్పటికీ తమకు అవసరమైన భూ పత్రాలను పొందలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపుతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీ భూమి పోర్టల్ ను పాత పద్ధతిలోనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అవసరమైన పత్రాలు పొందలేకపోతున్నా
నాకు 1బీ, ఎఫ్‌ఎంబీ పత్రాలు అవసరం పడ్డాయి. ఈ పత్రాల కోసం 20 రోజులుగా తిరుగుతున్నా. ప్రతి రోజు నెట్ సెంటర్ల వద్దకు వెళ్తున్నా. ప్రస్తుత ప్రభుత్వం మీ భూమి పోర్టల్‌కు ఓటీపీ విధానం అని కొత్తగా పెట్టిందంట. మొదట్లో ఆ ఓటీపీ చెప్పాలంటే భయమేసింది. తర్వాత చేసేదేమిలేక ఆ ఓటీపీ ని కూడా చెప్పాను. అయినప్పటికీ నాకు అవసరమైన భూ పత్రాలను పొందలేకపోయాను. సజావుగా సాగుతున్న మీ భూమి పోర్టల్ లో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. పూర్వపు విధానమే అమలు చేయాలి.
– నాగభూషణం, రైతు, చిత్తూరు జిల్లా
పాత పద్ధతినే అమలు చేయాలి
అసలే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అంతే కాని రైతులపై కక్ష సాధింపునకు పాల్పడే విధంగా కొత్త నిర్ణయాలు అమలు చేయడం సబబు కాదు. మీ భూమి పోర్టల్ లో తెచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అవసరమైన భూ పత్రాలు పొందలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాత పద్ధతిలోనే మీ భూమి పోర్టల్ ను కొనసాగించాలి.
– గోవర్ధన్, రైతు, చిత్తూరు జిల్లా
గతంలో భూములకు సంబంధించి 1బీ తీయాలన్నా.. అడంగల్ కావాలన్నా...ఎఫ్‌ఎంబీ అవసరం ఉన్నా ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లి నిమిషాల్లో మీ భూమి పోర్టల్ లో పొందేందుకు అవకాశం ఉండేది. కూటమి ప్రభుత్వం పుణ్యాన ప్రస్తుతం వాటిని పొందడం అంత సులభం కాదు. మీ భూమి పోర్టల్‌ను ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్ నంబర్ నమో దు చేయాలి. ఆ తరువాత క్యాప్‌చా వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వివరాలు ఓపెన్ అవుతా యి. ఈ తతంగం అంతా చేసేందుకు గంటల సమ యం పడుతుంది. ఓటీపీ నమోదు చేసి వివరాలన్ని నమోదు చేశాక ఓకే నొక్కితే సర్వర్ మొరాయిస్తూ సైట్ ఓపెన్ కాకుండా పోతోంది. ఇలా మూడు సార్లు ఓటీపీ నమోదు చేశాక ఆ తర్వాత ఆ రోజుకి ఇక పై అవకాశం లేనట్టే. ఒకవేళ లాగిన్ అయిన కాసేపటికే సర్వర్ బిజీ వస్తుంది. ఈ సమస్యలతో రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓటీపీ లేకుంటే భూ వివరాలు రావంతే..