
యథేచ్ఛగా శ్రమదోపిడీ
కర్మాగారం ముందు బైఠాయించిన ఽ నైట్ షిఫ్టు కార్మికులు
‘‘నాలుగు పరిశ్రమలు మా ప్రాంతంలో నెలకొల్పితే ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డాం. అయితే కంపెనీల యాజమాన్యం నిరంకుశ వైఖరిని చూస్తే దిక్కుతోచక నివ్వెరబోతున్నాం. రోజూ 12 గంటల పాటు శ్రమదోపిడీకి పాల్పడుతుంటే మౌనంగా భరిస్తున్నాం. కనీస వసతులు కల్పించకపోయినా నోరెత్తకుండా పనిచేశాం. ఇక తట్టుకోలేక ఇన్నేళ్లకి తిరగబడ్డాం. వెట్టిచాకిరీ చేస్తున్నా వేతనంలో కోత విధించడం దారుణం. ప్రశ్నించినందుకు సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేయించడం దుర్మార్గం’’ అంటూ రేణిగుంటలోని కార్బన్, నియో లింక్ పరిశ్రమ కార్మికులు మండిపడ్డారు. కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేణిగుంట : తిరుపతిని ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా గుర్తించి రేణిగుంట విమానాశ్రయ రహదారిలో ఈఎంసీ1, సీఎంసీ–2లో పదుల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతను అన్‌స్కిల్డ్ కింద కూలీలుగా పనిలో పెట్టుకుని శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేసిన యువత జీతంలో కూడా కోత పెట్టడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డెక్కి కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సంక్షేమ చట్టాలు, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పొట్ట పోషణకు వస్తే
రేణిగుంటలోని కార్బన్, నియో లింక్ పరిశ్రమలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ పోషణ కొరకు పొట్ట చేత పట్టుకొని చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో చిరు ఉద్యోగులుగా స్థానిక యువత వారి జీవితాలను దగా చేస్తున్నాయి. అయితే బుధవారం నియో లింక్ పరిశ్రమలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వందల మంది కార్మికులు రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి నిరసన గళం వినిపించారు. లేబర్ చట్టాల ప్రకారం రూ.23 వేల కనీస వేతనం చెల్లించాల్సి ఉండగా ఆ సంస్థ 8 గంటల పని కాకుండా అదనంగా 12 గంటలు పని చేయించుకుంటూ కేవలం రూ.10వేల నుంచి రూ.13 వేలు మాత్రమే చెల్లింస్తోందని కార్మికులు వాపోయారు. మహిళలకి సైతం మౌలిక వసతులు కూడా కల్పించడంలో కంపెనీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయించి, ఐడీ కార్డు బలవంతంగా తీసుకొని విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎదురు తిరిగితే సెక్యూరిటీ దారుణంగా దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం, రాత్రి రెండు విడతలగా కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ జయ చంద్ర, ఎస్‌ఐ సుధాకర్ హుటాహుటిన కంపెనీ వద్దకు చేరుకుని కార్మికులతో మాట్లాడారు. అనంతరం కార్బన్ యాజమాన్యం రంగంలోకి దిగి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. లేబర్ కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.
కంపెనీ ఎదుట డే షిఫ్ట్ కార్మికులు
కార్బన్–నియోన్ కంపెనీ
శ్రమ దోపిడీపై ఆందోళన
సెక్యూరిటీ సిబ్బందితో
దాడి చేయించడంపై ఆగ్రహం
12 గంటలు పనిచేయించుకోవడంపై ఆవేదన

యథేచ్ఛగా శ్రమదోపిడీ