
కరుణించమ్మా..
వైభవంగా రేణిగుంట గంగమ్మ జాతర
● పొంగళ్లు సమర్పించిన మహిళలు ● పోటెత్తిన భక్తజనం
రేణిగుంట: కాపాడరావమ్మా.. గంగమ్మా అంటూ గ్రామదేవత గంగమ్మను భక్తజనం కొలిచారు. మంగళవారం రేణిగుంట గంగ జాతర సందర్భంగా సూర్యోదయానికి ముందు అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్త సోల మల్లికార్జున్ రెడ్డి తొలి హారతి పట్టి జాతరను ప్రారంభించారు. నూతనంగా అమ్మవారికి బహూకరించిన బంగారు పూత వెండి కవచాన్ని అలంకరించడంతో ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఆవరణలో సింహ వాహనంపై అమ్మవారి ప్రతిమను అధిష్టింపజేసి చేపట్టిన విశేష పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నడివీధి గంగమ్మ త్రిశూలం వద్ద గంగమ్మ తల్లికి రాగి అంబలి పోసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహిళలు గంగమ్మ ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
గంగమ్మకు సారె
గంగమ్మ జాతర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మంగళవారం గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీకి ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అర్చకులకు సారెను అందించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి మాట్లాడుతూ ముందుగా గత 20 ఏళ్లుగా గంగజాతరలో పాల్గొంటున్నానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేశం, ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఉల్లా, వీఆర్ రావణ, వన్నెకుల సంఘం నాయకులు దాము, లక్ష్మయ్య పాల్గొన్నారు.