
అనుబంధ విభాగాలు చురుగ్గా పనిచేయాలి
● కూటమి అరాచకాలు, దాడులపై నిరసనలు చేయండి ● తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నాయకులు చురుగ్గా పని చేయాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు, దాడులపై పార్టీ జిల్లా అనుబంధ విభాగాల నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిరసనలు చేపట్టాలన్నారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా తాను ఉద్యమాల్లో ముందుంటానని తెలిపారు. కూటమి అరాచకాలను, దాడులను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారని, వాటిని ఆయా వర్గాల నాయకులు ఖండించాలన్నారు. సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.