
రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం కొనసాగుతున్నఆవర్తనం
వచ్చే మూడ్రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/కర్నూలు (అగ్రికల్చర్)/అనంతపురం అగ్రికల్చర్: ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13వ తేదీ నాటికి వాయవ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు ఆస్కారముందని తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశమున్నట్లు వెల్లడించింది.
పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో.. ఈనెల 12న ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 13న నంద్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 14న ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. 15న ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది.
సహాయక చర్యలకు టోల్‌ఫ్రీ నెంబర్లు..
వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. సోమవారానికి కాకినాడ జిల్లా రౌతులపూడిలో 4.2, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో 4.1, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది.