
సాక్షి, చెన్నై: హత్య కేసులో నిందితురాలైన జనసేన బహిష్కృత నేత వినుత కోటకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కండిషన్ బెయిల్ పై విడుదలైన ఆమె ఏపీకి రాలేని స్థితిలో చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మీడియా కంటపడకుండా ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తన దగ్గర డ్రైవర్ కమ్ పీఏగా పని చేసిన రాయుడు అనే యువకుడి హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు ఏ1 కాగా, ఆమె ఏ3 నిందితురాలు. ఈ కేసులో వినుతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల్లోపు సెవెన్‌వెల్స్ పోలీస్‌స్టేషన్‌లో తాము అనుమతించే వరకూ సంతకాలు చేయాలని న్యాయ స్థానం షరతు విధించింది. దీంతో.. గత రెండు రోజులుగా ఆమె రహస్యంగా వెళ్లి పీఎస్‌లో సంతకం పెట్టి వెళ్తున్నారు.
బెయిల్ వచ్చిందనే విషయం శుక్రవారం బయటకు రాగా.. ఇవాళ ఆమె కోసం పీఎస్ వద్ద మీడియా ప్రతినిధులు ఎదురు చూడసాగారు. రాయుడి కేసుకు సంబంధించిన వివరాలతో పాటు ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే..
తన లాయర్‌తో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆమె.. ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్, ముఖానికి మాస్క్ ధరించారు. సంతకం చేశాక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సాక్షి ప్రతినిధి ఆమెను పలకరించే ప్రయత్నం చేయగా.. ఆమె లాయర్ చెయ్యి అడ్డుపెట్టి ఆపారు. బండిని ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.
కేసు ఏంటంటే..
జులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్‌చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు.
జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనగా.. చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.