కూటమి నేతల ప్రచార ఆర్భాటం
పాత షాపులనే తిరిగి ప్రారంభించిన కూటమి నేతలు
ప్రారంభించాక రేషన్ వెయ్యకనే వెనక్కు పంపేసిన డీలర్లు
పలుచోట్ల పనిచేయని సర్వర్లు..తప్పని నిరీక్షణలు
వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే,మేయర్లను పిలవొద్దని ఆదేశాలు
చిట్టమూరు : ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులు తమ గ్రామానికి వచ్చే ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే 10 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఎలా సరుకులు తెచ్చుకోవాలని కోతలగుంట గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం ఈశ్వరవాక గ్రామానికి సుమారు 10 కిలో మీటర్లు ఉంటుందన్నారు. గ్రామంలో 120 కుటుంబాల వారు నివాసం ఉన్నారన్నారు. ఇంత దూరం పంట పొలాల్లో నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందన్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి పాలనలో సేవలు ఒక్కొక్కటిగా రద్దవుతుండటంతో జనం వీధిన పడ్డారు. నాడు ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ల వ్యవస్థకు నేడు మంగళం పాడారు. గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలు నేడు అందకపోవడంతో జనం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదు. తాజాగా ఇంటింటికీ రేషన్‌ను చేరవేసే వాహనాలను రద్దు చేసి లబ్ధిదారులు దుకాణాల వద్దకు వెళ్లి బియ్యం, చక్కెర ఇతర సరుకులు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆదివారం రేషన్ కోసం జనం వీధుల బాట పట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. డీలర్లు వాహనాల్లో రేషన్ తీసుకుని లబ్ధిదారుని నివాసానికి వెళ్లి సరుకులు పంపిణీ చేసేవారు. కూటమి పాలన వచ్చిన వెంటనే రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడేసింది. దీంతో ఆదివారం చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం పలువురు వృద్ధులు మహిళలు మండు టెండలో నిరీక్షించి అష్టకష్టాలు పడి హమ్మయ్య ఈ రోజుకు తీసుకున్నామని కొంత మంది ఊపిరిపీల్చుకోగా మరికొంత మందికి బియ్యం అందక నిట్టూరుస్తూ ఇంటి బాట పట్టారు.
గంటల తరబడి ఎండలో నిరీక్షణ
రేషన్ డోర్ డెలివరీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో చేసేది లేక లబ్ధిదారులు ఆదివారం ఉదయమే దుకాణాల వద్దకు పరుగులు తీశారు. అయితే కూటమి ఎమ్మెల్యే, స్థానిక నాయకులు వచ్చే వరకు రేషన్ వేయమని చెప్పడంతో లబ్ధిదారులు ఎండలో క్యూలైన్లో బారులు తీరక తప్పలేదు. కొన్ని చోట్ల కూటమి నేతలు వచ్చి ప్రారంభించి వెళ్లిపోయాక డీలర్లు ఇద్దరు, ముగ్గురికి సరుకులు పంపిణీ చేసి సోమవారం రండి అని వెనక్కు పంపించి వేశారు. తిరుపతి నగరంలోనే కాకుండా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించడంతో గంటల తరబడి ఎండలో వేచి ఉండక తప్పలేదు. రెండు, మూడు కిలోమీటర్ల నుంచి లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు తరలిరావడం కనిపించింది. గంటల తరబడి వేచి ఉండి రేషన్ తీసుకుని నెత్తిన పెట్టుకొని ఎండలోనే సొంత ఊర్లకు తిరిగి వెళ్లడం కనిపించింది. మరికొన్ని చోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోకపోవడంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంకొన్ని చోట్ల దుకాణాలు ఆలస్యంగా తెరుచుకోవడంతో అప్పటి వరకు కార్డుదారులు పడిగాపులు పడ్డారు.
కంది పప్పు, చక్కెర సగం మందికే..
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. ఆదివారం ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ దుకాణాల్లోనూ కందిపప్పు, చక్కెర అరకొరగానే ఇచ్చారు. తిరుపతి జిల్లాలో మొత్తం 1457 చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ చౌక దుకాణాల పరిధిలో 6.03 లక్షల రేషన్ కార్డు దారుల కోసం ప్రతి నెలా 8,350 మెట్రిక్ టన్నుల బియ్యం, 600 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 1200 మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతి చేయాల్సి ఉంది. అయితే ఈ నెల కోటా కింద బియ్యం మాత్రమే పూర్తి స్థాయిలో దిగుమతి అయ్యాయని అధికారులు చెబుతున్నారు. కందిపప్పు, చక్కెర మాత్రం సగం మాత్రమే దిగుమతి అయ్యాయ ని వెల్లడించారు. ఫలితంగా కార్డు దారులందరికీ పూర్తి స్థాయిలో కందిపప్పు, చక్కెర ఇచ్చే పరిస్థితి లేదని సంబంధిత అధికారులు చెప్పడం గమనార్హం.
బండ్లు తీసేసి ఇవేం పనులయ్యా
ఉన్న బండ్లు తీసేసి ఇవేం పనులయ్యా. రేషన్ షాపు సరుకులు నేరుగా ఇంటికి వచ్చి ఇస్తావున్నారు కదా, వాటిని రద్దు చేసి ఏమి సాధిస్తారు. ఇప్పుడు గోతాం తీసుకుని ఎదురు చూసి తీసుకునే పరిస్థితి. ఇక నుంచి రేషన్ కష్టాలు మళ్లీ పడాల్సిందేనా. – తుపాకులు రేణుక,కోటపోలూరు, సూళ్లూరుపేట మండలం
పాత దుకాణాలకు ముస్తాబు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రేషన్ దుకాణాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. పాత రేషన్ దుకాణాలకు మామిడి తోరణాలు, పూలు అలంకరించి స్థానిక ఎమ్మెల్యే, కూటమి నేతల ద్వారా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లను ఆహ్వానించవద్దని అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులే ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆలస్యమైనా కూటమి నేతలు వచ్చే వరకు రేషన్ వేయడానికి వీల్లేదని అనేక చోట్ల డీలర్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.
ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు!
నరసింగాపురంలోని చౌక దుకాణాన్ని ఇష్టం వచ్చిన సమయంలో తెరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో రేషన్ ఇవ్వడం మానేశారు. గ్రామస్తులంతా ప్రశ్నించారు. దీంతో డీలరు మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. గతంలో ఇస్తున్న మాదిరిగానే రేషన్ అందించాలి.
– కోమల, నరసింగాపురం


