డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీరు | Treated wastewater for data centers | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీరు

Jun 24 2026 4:27 AM | Updated on Jun 24 2026 4:27 AM

Treated wastewater for data centers

డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్‌

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టు అమలు  

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో డేటా సెంటర్లకు డిమాండ్‌ అదే స్థాయిలో ఉంటోంది. వీటికి పెద్ద ఎత్తున నీరు అవసరం. హైదరాబాద్‌ సమీపంలో డేటా సెంటర్లు ఒకదాని వెంట ఒకటి ఏర్పాటు అవుతుండడంతో సహజ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక హబ్‌లకు, ముఖ్యంగా డేటా సెంటర్ల అవసరాలను తీర్చడం కోసం శుద్ధి చేసిన నీటిని పెద్దఎత్తున సరఫరా చేసేలా బృహత్‌ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. 

ఈ వ్యూహాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అమలు చేయాలని భావిస్తోంది. నగరంలోని ప్రధాన డిమాండ్‌ కేంద్రాలకు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్‌టీపీ) నుంచి శుద్ధి చేసిన మురుగునీటిని దీర్ఘకాలంపాటు సరఫరా చేయడానికి, వాడుకోవడానికి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పదిలంగా నీటి వనరులు..
ప్రస్తుతం నగరంలో రోజుకు 1,750 మిలియన్‌ లీటర్ల కంటే ఎక్కువ శుద్ధి సామర్థ్యంతో మొత్తం 41 ఎస్‌టీపీలను జలమండలి నిర్వహిస్తోంది. చందన్‌వెల్లి ప్రాంతంలోని పారిశ్రామిక క్లస్టర్, ప్రతిపాదిత ఫ్యూచర్‌ సిటీ కోసం రోజుకు 530 మిలియన్‌ లీటర్ల డిమాండ్‌ అంచనాతో సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధికి డీపీఆర్‌ సిద్ధం చేస్తారు. అలాగే, అత్తాపూర్‌లో ఉన్న ఎస్‌టీపీ నుంచి చందన్‌వెల్లి వరకు 41 కి.మీ. దూరంలో పైప్‌లైన్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. 

దీని ద్వారా 2035 నాటికి ఈ క్లస్టర్‌లో రోజుకు 239 మిలియన్‌ లీటర్ల డిమాండ్‌ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నాగోల్‌లో ఉన్న ఎస్‌టీపీల నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 56.6 కి.మీ. దూరంలో మరొక పంపిణీ మౌలిక సదుపాయాల మార్గం ప్లాన్‌ చేశారు. 2035 నాటికి రోజుకు 290 మిలియన్‌ లీటర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న, అలాగే రాబోయే డేటాసెంటర్లకు ఉపయోగపడుతుంది. 

ఇప్పటికే ఉన్న పార్కులకు..
రెండు పైప్‌లైన్లు కూడా ఓఆర్‌ఆర్, ఇతర ముఖ్యమైన రహదారుల వెంబడి వెళ్తుండటం వల్ల రామచంద్రాపురంలోని అసిస్టెడ్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్, పటాన్‌చెరు ఇండస్ట్రియల్‌ పార్క్, ఐడీఏ పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, సుల్తాన్‌పూర్‌ ఇండస్ట్రియల్‌ పార్క్, గుండ్లపోచంపల్లి అపారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ పార్క్, ఎల్‌ఈఏపీతో సహా ఇతర పారిశ్రామిక క్లస్టర్లు, సంస్థల అవసరాలను తీర్చడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. గాజులరా మారం, ఐడీఏ జీడిమెట్ల, ఎస్‌వీసీఐఈ జీడిమెట్ల, సీసీ జీడిమెట్ల, ఇండస్ట్రియల్‌ పార్క్‌ మౌలాలీ, 158 కి.మీ. ఓఆర్‌ఆర్‌ హరితహారం నిర్వహణతోపాటు అగ్నిమా పక, వినోద, ల్యాండ్‌స్కేపింగ్‌ అవసరాలకూ ఈ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయొచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement