హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్ జిల్లా చైర్మన్ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు.
మల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2). తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు.
ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్‌రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ శిశువిహార్‌లో అప్పగించారు.
ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు.
- ప్రజల్లో అవగాహన పెరగాలి
చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. చట్టంపై సరైన అవగాహన కొరవడి ఉచిత న్యాయసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి అనాథ పిల్లలు, దిక్కులేని అభాగ్యులను ఆశ్రయం కలి్పంచే అనేక మార్గాలున్నాయి. అలాంటి వారు ఏవరైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లు, న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయిస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలి.
– బాల భాస్కర్, మేడ్చల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి


