నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షో: టీపీసీసీ చీఫ్ | TPCC Chief Mahesh Kumar Satirical Comments On Nitin Nabin Tour | Sakshi
Sakshi News home page

నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షో: టీపీసీసీ చీఫ్

Jun 29 2026 7:00 AM | Updated on Jun 29 2026 11:08 AM

TPCC Chief Mahesh Kumar Satirical Comments On Nitin Nabin Tour

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షోగా ముగిసిందని టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చిన్న సమావేశాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, అలాంటి పరిస్థితిలో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటనపై తాజాగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పందిస్తూ..‘అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను ఇప్పటికే తిరస్కరించారు. జీహెచ్‌ఎంసీ గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా?. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలి.

తెలంగాణలో బూత్‌లు గెలుస్తాం, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తాం అని ప్రగల్భాలు పలికే ముందు గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి. తెలంగాణలో బెంగాల్ తరహా విభజన రాజకీయాలు సాగవని హెచ్చరించిన ఆయన, నగరాల పేర్లు మార్చడంపైనే బీజేపీ దృష్టి ఉందని, ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళిక మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. సుష్మా స్వరాజ్‌పై తమకు గౌరవం ఉన్నప్పటికీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. 

వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ, ఎన్నికల అవసరాల కోసం వారసత్వ నాయకులను పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రాజెక్టుల వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ జాతీయవాదం పేరును ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement