ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం | Telangana High Court to hear PIL pleas over Kancha Gachibowli lands on April 24 | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం

Apr 8 2025 1:26 AM | Updated on Apr 8 2025 1:26 AM

Telangana High Court to hear PIL pleas over Kancha Gachibowli lands on April 24

‘కంచ గచ్చిబౌలి’పై సర్కార్‌కు తేల్చిచెప్పిన హైకోర్టు 

తదుపరి విచారణ 24కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరికివేతకు సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాంటి పోస్టులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరగా, కౌంటర్‌ దాఖలు చేస్తే పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వంతోపాటు, అటవీ, రెవెన్యూ, పోలీసు విభాగాలను కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని ఆపాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటవీ శాఖ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి హాజరై.. ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చేలా తప్పుడు ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారని చెప్పారు. 

కృత్రిమమేధ (ఏఐ)తో ఫేక్‌ ఫొటోలు సృష్టించి, వాటిని సోషల్‌ మీడియాలో పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు పిటిషనర్‌ కాదు కదా.. ప్రతివాది కనుక, మీ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయండి.. పరిశీలించి ఆదేశాలు జారీ చేస్తాం’అని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇతర ప్రతివాదులను కౌంటర్‌ వేయాలని చెప్పింది. 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేస్తోందని, తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసిందని చెప్పారు. ఒకేసారి ఇరుకోర్టులు విచారణ జరపడం సరికాదని, వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం పాత పిల్‌లకు అటాచ్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement