కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
సుప్రీంకోర్టు సూచన, హైకోర్టు మధ్యంతర తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
బీసీలకు 42 % కోటా కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయం
డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం
కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో 42% సీట్లు ఇవ్వాలని నిర్ణయం
సౌదీ మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
మల్టీ యూజర్ జోన్లుగా ఔటర్ లోపలి పరిశ్రమల స్థలాలు.. పాలసీకి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా అమలు చేస్తూ వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా చేపట్టిన ఎన్నికల ప్రక్రియ కోర్టు కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి.. 25న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోదించాలని నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమై ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగియనుండగా, ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామాలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. డిసెంబరులో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేక రాష్ట్రపతి వద్దే బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు ఎన్నికల్లో 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
⇒ హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మందిలో 44 మంది సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుసేన్, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించింది. కుటుంబసభ్యుల కోరిక మేరకు మృతులకు అక్కడే అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబం నుంచి ఇద్దరిని ప్రభుత్వ ఖర్చుతో అక్కడకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్టు షబ్బీర్ అలీ తెలిపారు. వారికి వీసాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
⇒ ఇటీవల మృతి చెందిన కవి, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ కుమారుడు ఎ.దత్తసాయికి డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావితరాలకు తెలియజేసేలా అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ’గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని నిర్ణయించింది.
⇒ ఎస్సారెస్పీ రెండో దశ ప్రధాన కాల్వకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
⇒ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలి ప్రాంతాలకు తరలించాలని గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ పరిశ్రమల స్థలాలను మల్టీ యూజ్ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’కి కేబినెట్ ఆమోదించింది.
⇒ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగాం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించనున్నారు. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.


