మిర్యాలగూడ: భూమిని రాయించుకుని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఓ తల్లి పురుగు మందు డబ్బాతో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామానికి చెందిన ఉప్పతల సుగుణ మాట్లాడుతూ..
తనకున్న ఎకరం పది గుంటల వ్యవసాయ పొలాన్ని రాయించుకున్న కొడుకు ఇంటి నుంచి గెంటివేశాడని ఆరోపించింది. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లినా అధికారులు స్పందించకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయ పొలం కూడా రాయించుకున్న కొడుకు తనను పోషించడం లేదని తెలిపింది. వయోవృద్ధుల చట్టం కింద భూమిని, ఇంటిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరింది. తల్లికి మద్దతుగా ఆమె కుమార్తె కూడా కూర్చుంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ సురేష్‌కుమార్ విచారించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకుంది.
son-kicked-his-mother-out-of-house-for-property-in-nagarkurnool


