నల్లగొండ జిల్లా: నేరడుగొమ్ము మండలంలో ప్రేమికుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులికంటి శ్రీను అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించి, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు మంజుల ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో గురువారం శ్రీను ఇంటి ఎదుటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన మంజుల, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంజుల కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా, తోపులాట కూడా జరిగింది. తనకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అంటూ మంజుల ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రేమ పేరుతో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఘటన అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని మంజులను శాంతింపజేశారు. ప్రస్తుతం ఆమె ప్రియుడు పులికంటి శ్రీను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


