మృతి చెందిన వ్యక్తికి రాఖీలు కట్టిన తోబుట్టువులు
కేసముద్రం: రాఖీ పండుగ రోజే ఒక్కగానొక్క సోదరుడు అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లడిల్లిపోయిన ఐదుగురు తోబుట్టువులు అతడికి రాఖీలను కట్టి ప్రేమను చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్‌లో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుంకరబోయిన చిన్నసోమయ్య, లక్ష్మి దంపతులకు కుమార్తెలు పూలమ్మ, జయమ్మ, దేవా, నాగమ్మ, నీలమ్మ, కుమారుడు యాకన్న ఉన్నారు.
అందరికీ పెళ్లిళ్లు చేశారు. కాగా, యాకన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. యాకన్నకు నలుగురు అక్కలు, ఒక చెల్లెలు ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు వచ్చి రాఖీలు కట్టేవారు. మృతి చెందిన సోదరుడి చేతికి రాఖీలు కడుతూ తమ్ముడా, అన్నయ్యా.. ఇవే మా చివరి రాఖీలు అంటూ వారు రోదించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది.