మహబూబాబాద్ జిల్లా: మందుబాబులు తాగుతున్న మద్యం బాటిల్‌లో బల్లితోక కనిపించడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఓ బెల్ట్ షాపులో బుధవారం చోటుచేసుకుంది. బాధిత మందుబాబుల కథనం ప్రకారం.. మండలంలోని వీరారం గ్రామానికి చెందిన కొందరు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా సమీపంలోని ఓ బెల్ట్ షాపులో బ్లెండర్ స్పైడ్ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి సేవిస్తున్నారు.
ఈ క్రమంలో సగానికిపైగా అయిపోయిన మద్యం బాటిల్‌లో ఓ వింత ఆకారం కనిపించగా బయటికి తీశారు. అది తోకగా గుర్తించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మందుబాబులు వాంతులు చేసుకున్నారు. గొంతులో మంటగా ఉందని కేకలు పెట్టారు. అక్కడున్న కొందరు సదరు బెల్ట్ షాపు నిర్వాహకుడిని నిలదీయగా సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జారుకున్నాడు. ఇది కల్తీ మద్యంగా భావించిన బాధితులు సంబంధిత ఎక్సైజ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


