ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో తమిళనాడు, త్రిపుర ముఖ్యమంత్రులు జోసెఫ్ విజయ్, మాణిక్ సాహా
హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాల అభివృధ్ధికి ఎం–6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి
నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవానికి సహకరించాలని వినతులు
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, నైఫుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా నిలుస్తున్న ఆరు మెట్రో నగరాల సమగ్ర అభివృద్ధికి ఎం–6 టాస్క్‌ఫోర్స్ పేరుతో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నగరాలను ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ఒక్కో మెట్రో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరాభివృధ్ధికి రూ. లక్ష కోట్లివ్వాలని కోరింది.
ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. దేశ జనాభాలో దాదాపు 10 శాతం మంది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో నివసిస్తుండగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు పావు వంతు (25 శాతం) వాటాను ఇవే సమకూరుస్తున్నాయని.. అందువల్ల ఈ నగరాల అభివృద్ధిని సాధారణ వ్యయంగా కాకుండా, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి అవసరమైన వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలని రేవంత్‌రెడ్డి సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక, పరిపాలనా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
2047 నాటికి 3 ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థ..
కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని రేవంత్‌రెడ్డి వివరించారు. ‘2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎస్‌జీడీపీ సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణ, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి విప్లవం...
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య, భోజనం, రవాణా, డిజిటల్ లెర్నింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం సుమా రు రూ. 24,000 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామ ని వివరించారు.
65 ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కోర్సులు అందిస్తున్నామన్నారు. 26 వేలకుపైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించామని.. ఉపాధ్యాయుల కొరత తీ ర్చేందుకు 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు సీఎం వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుందని తెలిపారు.
సీఎంలు వస్తే యంగ్ ఇండియా స్కూళ్లు చూపిస్తాం..
ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి లేదా అధికారులైనా తెలంగాణలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చూడాలనుకుంటే సంతోషంగా చూపిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు.
నీతి ఆయోగ్‌కు సీఎం చేసిన వినతులు ఇవీ..
⇒ తెలంగాణ విద్యార్థుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఐఐఎంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి.
⇒ హైదరాబాద్ విస్తరణకు వెన్నెముకగా భావిస్తున్న రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు వేగవంతానికి సహకరించాలి.
⇒ భారత్ ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించే 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలి.
⇒ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 విస్తరణకు సహకారం అందించాలి.
⇒ హైదరాబాద్ చారిత్రక జీవనాడి అయిన మూసీ నదిని ప్రపంచస్థాయి రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేసేందుకు నిధులివ్వాలి.
⇒ 30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్, నెట్ జీరో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక మద్దతు ఇవ్వాలి.
⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు, పీఎంకేఎస్‌వై సాయం మంజూరు చేయాలి. ళీ సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణకు ప్రాధాన్యమిచ్చి ఎల్రక్టానిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీఎంపీ, ఓసాట్ క్లస్టర్లు, మైక్రో ఎల్‌ఈడీ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి.


