దసరాలోపు నామినేటెడ్‌ పదవులు | PCC chief meets graduate MLC aspirants | Sakshi
Sakshi News home page

దసరాలోపు నామినేటెడ్‌ పదవులు

Oct 4 2026 4:32 AM | Updated on Oct 4 2026 4:32 AM

PCC chief meets graduate MLC aspirants

యువత, బీసీలకు ప్రాధాన్యతే పార్టీ ఎజెండా

గవర్నర్‌ కోటాలో ఇద్దరు బీసీలకు అవకాశం వస్తుంది

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఆశావహులతో భేటీలో పీసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్‌ పోస్టులను దసరాలోపు పూర్తి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. కచి్చతంగా దసరాలోపు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళుతున్నామని, ఒకవేళ సాధ్యం కాకపోతే ఆ తర్వాత పదిరోజుల్లో భర్తీ చేస్తామని ఆయన చెప్పినట్టు సమాచారం. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ టికెట్లు ఆశించి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న పార్టీ యువ నాయకులతో శనివారం ఆయన గాం«దీభవన్‌లో భేటీ అయ్యారు. 

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన గౌరి సతీశ్, చరణ్‌కౌశిక్‌ యాదవ్, బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన డాక్టర్‌ లోకేశ్‌యాదవ్, చనగాని దయాకర్‌లతో సమావేశమైన ఆయన పలు అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న అనంతరం అనివార్య పరిస్థితుల్లోనే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ టికెట్లు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. 

గవర్నర్‌ కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని కచ్చితంగా బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆశావహులు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రాధాన్యత ఇవ్వని కులాలు, జిల్లాల నుంచి ఈసారి అవకాశం కల్పించాలని, ఎమ్మెల్సీలుగా యువ బీసీ నాయకులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. అదే విధంగా నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 42 శాతం పోస్టులివ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేశ్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement