ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనలో కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో పనిచేస్తుందని విమర్శించారు. ఏపీ విభజనలో వారసత్వపు ఆస్తుల వివాదాలు ఇంకా అలానే ఉన్నాయని, తెలంగాణలో తన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. 12 ఏళ్లు అయినా ఇప్పటికీ తెలంగాణ అమరులను గుర్తించలేదన్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు( సోమవారం, జూన్ 15వ తేదీ) పవన్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ ధ్వజమెత్తారు. ‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు.


