ఎస్‌ఐఆర్‌... ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం | Parakala Prabhakar Sensational Comments On SIR, Says SIR Process Undermines Democracy And Voter Rights | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌... ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

Jun 16 2026 1:07 AM | Updated on Jun 16 2026 1:37 PM

Parakala Prabhakar Sensational Comments on SIR

మాట్లాడుతున్న పరకాల ప్రభాకర్‌. చిత్రంలో కూనంనేని, ప్రొఫెసర్‌ నాగేశ్వర్, మాడభూషి శ్రీధర్‌

ప్రభుత్వం ఓటర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోంది: పరకాల ప్రభాకర్‌ 

దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపే లక్ష్యంగా కుట్ర: కూనంనేని 

ప్రశ్నించినందుకే నాపై అక్రమ కేసులు: ప్రొ. నాగేశ్వర్‌ 

సహజ న్యాయ సూత్రాలను పాటించాలి: మాడభూషి శ్రీధర్‌

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా ప్రభు త్వం ఓటర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ నైతికతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశా రు.

బలహీన వర్గాల ఓటు హక్కుకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన, శాస్త్రీయత లేని ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు వల్ల తన విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. సోమవారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు.  

ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోవాలి: కూనంనేని 
ఎస్‌ఐఆర్‌ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కూనంనేని ఆరోపించారు. ఓట్ల తొలగింపే ప్రధాన ఎజెండాగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని, దీనికి సూత్రధారులు ఢిల్లీలోని కేంద్ర పాలకులేనని విమర్శించారు. తెలంగాణలో 80 లక్షల వరకు దొంగ ఓట్లు గుర్తించామని చెబుతున్నారని, ఆ పేరుతో చెల్లుబాటయ్యే ఓట్లను కూడా తొలగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని చెప్పారు. ఎన్నికల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఓటర్ల పేర్లను తొలగించే ముందు సహజ న్యాయ సూత్రాలను పాటించాలని, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఉండాలని పేర్కొన్నారు.  

రాజ్యాంగ వ్యవస్థలు అ«దీనంలోకి తెచ్చుకునేందుకే... 
భావప్రకటన స్వేచ్ఛను వినియోగించి ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఆరోపించారు. ప్రశ్నించే వారిని కేసులతో భయపెట్టే ధోరణి పెరుగుతోందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. అలాగే మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను కేసులు లేకున్నా తిరస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర పాలకులు తాము చేసేదే శాసనమనే భావనలో ఉన్నారని ధ్వజమెత్తారు.

రాజ్యాంగ వ్యవస్థలను తమ అ«దీనంలోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఎస్‌ఐఆర్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలని, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంస్కరణలు అమలు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement