
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ ఉధృతి కారణంగా చౌటుప్పల్ నుంచి బొల్లేపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వివరాల ప్రకారం.. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ నది ఉరకలేస్తోంది. దీంతో, మూసీ నది ప్రవహిస్తున్న మార్గంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు.. వలిగొండ (మం)సంగం వద్ద రోడ్డుకు ఇరు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం కారణంగా చౌటుప్పల్ టూ బొల్లేపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పొలాలకు వెళ్ళే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. మూసీ రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం ఉదయానికి ఇన్‌ఫ్లో 12,184 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో నీటిమట్టం 645 అడుగుల గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 11,737 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎమమ ప్రధాన కాల్వలకు 390 క్యూసెక్కుల నీటిని విడుద ల చేస్తున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో 4.17 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.