నల్లగొండ: రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు నేర సామ్రాజ్యాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసు వివరాలను శనివారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టయిన భూష్మి శ్రీకాంత్‌ను విచారించగా.. అతడిచ్చిన సమాచారం మేరకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అతడి ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.
పట్టుబడిన వారిలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన తమ్మిశెట్టి నాగరాజు, ఆలేటి కోటేశ్వరరావు, పిడుగురాళ్ల మండలం అంజనీపురం గ్రామానికి చెందిన అల్లంశెట్టి సాయికిరణ్ అలియాస్ పాండు, సమంతపు వెంకటఅశోక్, అమరావతి మండలం మండేపూడి గ్రామానికి చెందిన సపావత్ నాగకిరణ్‌బాబునాయక్, పెదకూరపాడుకు చెందిన పిల్లి రాజేష్ ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.53 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు, రెండు టీవీలు, రెండు సౌండ్ బార్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఏడు మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. మరో ఇద్దరు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన గాడిబోయిన గోపిసాయి, తమ్మండ్ర రమేష్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
యువకులను మచ్చికచేసుకుని..
భూష్మి శ్రీకాంత్ ఏపీలోని విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలతోపాటు తెలంగాణలోని నల్లగొండ తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వైన్ షాపుల వద్ద పరిచయమైన యువకులకు మద్యం తాగించడం, డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని సహాయం చేసి మచ్చిక చేసుకునేవాడని ఎస్పీ తెలిపారు. అనంతరం ఆ యువకులను ప్రలోభపెట్టి నేరాల వైపు మళ్లించేవాడని వెల్లడించారు. చోరీలు ఎలా చేయాలనే దానిపై ముఠా సభ్యులకు శ్రీకాంత్ శిక్షణ కూడా ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
జైలులో పరిచయం.. నేరాల్లో భాగస్వామ్యం
శ్రీకాంత్ మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేశాడని, వీరిలో తమ్మిశెట్టి నాగరాజు మినహా మిగిలిన ఎనిమిది మంది యువకులకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని ఎస్పీ పేర్కొన్నారు. తమ్మిశెట్టి నాగరాజుపై ఆంధ్రప్రదేశ్‌లో 10కి పైగా కేసులు ఉండటంతోపాటు ఒక దోపిడీ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో నాగరాజుకు భూష్మి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడిందని, నాగరాజు జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీకాంత్‌కు ఆశ్రయం కల్పస్తూ అతడితో కలిసి నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు.
40 కేసుల్లో ప్రమేయం
ఈ ముఠా సభ్యులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళ చోరీలకు పాల్పడేవారని, నల్లగొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ వన్‌టౌన్, మిర్యాలగూడ టూటౌన్, నల్లగొండ వన్‌టౌన్, వాడపల్లి, తిప్పర్తి, మాడుగులపల్లి, చండూరు, కనగల్, డిండితో పాటు ఏపీలోని నరసరావుపేట, సంతమంగలూరు, ఇబ్రహీంపట్నం, మద్దిపాడు, ఫిరంగిపురం, సింగరాయకొండ, అద్దంకి, కొల్లిపర, నల్లపాడు, బాపట్ల, పిడుగురాళ్ల, విజయవాడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 40 చోరీలకు పాల్పడినట్లు తమ విచారలో తేలిందని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా 12 వేర్వేరు నేరాల్లో నిందితుల వేలిముద్రలు సరిపోలియాని, పలు కేసుల్లో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కూడా నిందితులను గుర్తించామని ఎస్పీ చెప్పారు.


