హైదరాబాద్: ఓ కరుడుగట్టిన దొంగను బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సినీఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లో నివసించే వినోద్‌కుమార్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు అపరిచితులు వినోద్‌కుమార్ వద్దకు వచ్చి అర్జెంటుగా ఫోన్‌కాల్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేయడంతో తన ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకరు ఫోన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు.
వినోద్ ఆగంతకుడిని అనుసరిస్తూ వెళ్లగా బీరు సీసాలతో దాడి చేశాడు. బెదిరించి, కొట్టి ఫోన్‌తోపాటు రూ.3 వేలు లాక్కొని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా పరారయ్యాడు. వెంటనే బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కాలనీ రోడ్డులోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు తిష్ట వేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి రెండువైపుల నుంచి వెతుకుతుండగా ఒకచోట బీరు తాగుతూ కనిపించాడు. పట్టుకునేందుకు యత్నించగా బీరు బాటిల్ పగులగొట్టి పొడుస్తానంటూ.. కత్తితో బెదిరిస్తూ వారిని తప్పించుకుని ఎమ్మెల్యే కాలనీలోకి పరారయ్యాడు.
ఐదు గంటల్లో పట్టివేత...
రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అక్కడ ఓ ఇంటి ప్రహరీ దూకి రోడ్డు వైపు వచ్చేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు సమీపంలో ఉండేవాడని, అతడు పాత నేరస్తుడైన తురేకర్ అజయ్ అలియాస్ బబ్లూ(27)గా గుర్తించారు. ప్రస్తుతం సనత్‌నగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తేలింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న బబ్లూ రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. గంజాయికి, మద్యానికి బానిసై దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది.


