సాక్షి, ములుగు: మహా జాతరకు సమయం దగ్గర పడుతున్న వేళ.. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం మండమెలిగే పండుగ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ పండుగతోనే మహాజాతర పూజా కార్యక్రమాల తంతు మొదలు కానుందని తెలిసిందే.
మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో, ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజుల గుడిలో ఇవాళ మండమెలిగె పండుగను ఆదివాసీల ఆచార, సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేస్తారు.
పూర్వం ప్రస్తుతం ఉన్న గుడుల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి అవి పాతపడడంతో ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. అలా గుడిమెలిగే.. జాతరకు వారం ముందు మండ మెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే సమక్క-సారలమ్మ మహా జాతర.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈసారి జనవరి 28 నుండి 31 వరకు జరగనున్నాయి.
ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో.. 50 శాతం అదనపు ఛార్జీలు..
మహా జాతర నేపథ్యంలో.. ఈ నెల 25 నుంచి మేడారానికి స్పెషల్ బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు యధావిధిగా కొనసాగనున్నాయి. అయితే.. వన్‌వే బస్సులు నిండుగా వెళ్తాయి కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలియజేశారు. రాష్ట్రం నలమూలల నుంచి మేడారం వైపు మొత్తం 4 వేల బస్సులను తిప్పుతామని.. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి 51 స్పెషల్ పాయింట్స్ ఉంటాయని తెలిపారాయన. మేడారం వద్ద ఆర్టీసీ బస్సుల కోసం 50 క్యూ లైన్స్.. ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించారు. మొత్తం 10 మంది సిబ్బంది మేడారం జాతర నేపథ్యంలో పని చేస్తారని అన్నారాయన.


