మదీనా బస్సు విషాదం.. బాధిత కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా పంపిణీ | Madina Bus Tragedy: Distributes Pending Ex Gratia To Victims Families | Sakshi
Sakshi News home page

మదీనా బస్సు విషాదం.. బాధిత కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా పంపిణీ

Jun 10 2026 11:00 PM | Updated on Jun 10 2026 11:00 PM

Madina Bus Tragedy: Distributes Pending Ex Gratia To Victims Families

సాక్షి, హైదరాబాద్‌: సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా చెక్కులను తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌ ఖుస్రో పాషా, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి, టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి బి. షఫీయుల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఉన్నతాధికారుల బృందం సౌదీ అరేబియాకు వెళ్లి బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు.

బాధితుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భారత కాన్సులేట్, సౌదీ అధికారులతో సమన్వయం చేసి అంత్యక్రియలతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ విషాదం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement