ఈ బస్సు నడపటం నావల్ల కాదు సామీ..! | APSRTC Driver Refuses To Drive Overcrowded Bus | Sakshi
Sakshi News home page

ఈ బస్సు నడపటం నావల్ల కాదు సామీ..!

Jul 7 2026 1:32 PM | Updated on Jul 7 2026 2:04 PM

APSRTC Driver Refuses To Drive Overcrowded Bus

మార్కాపురం జిల్లా: మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపింది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ‘ఈ బస్సు నడపటం నా వల్ల కాదు సామీ.. ’అంటూ డ్రైవర్‌ బస్సు దిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన మార్కాపురం జిల్లా పొదిలిలో సోమవారం చోటుచేసుకుంది. పొదిలి నుంచి కొండపి వెళ్లే బస్సులో 80 మందికిపైగా ప్రయాణికులు ఎక్కారు. పెద్ద బస్టాండ్‌కు బస్సు చేరుకునే సరికి అక్కడ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. 

వారిని చూసిన డ్రైవర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘బస్సు ఎక్కే ప్రయాణికులు అంతా లోపలికి రావాలి. ఫుట్‌ బోర్డు ప్రయాణం ఇబ్బంది. రోడ్డు కూడా బాగా లేదు. ఏదైనా అయితే నా ఉద్యోగానికి ముప్పు’ అంటూ డ్రైవర్‌ సుమారు ఐదు నిమిషాల పాటు ప్రయాణికులను ప్రాధేయపడ్డాడు. అయినా వారు బస్సులోపలికి వెళ్లలేదు. ఎంత చెప్పినా వినకపోయేసరికి బస్సును పెద్ద బస్టాండ్‌ సెంటర్‌లో ఆపి కిందకు దిగిపోయాడు డ్రైవర్‌. 

అయినా బస్సులో నుంచి ఒక్కరూ దిగలేదు. లోపలికీ వెళ్లలేదు. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డుకు పరిస్థితి వివరించి, నీవైనా చెప్పి వారిని బస్సు లోపలికి పంపించమని డ్రైవర్‌ కోరాడు. దీంతో హోంగార్డు కూడా ప్రయాణికులను బతిమిలాడాడు. అయినా ప్రయాణికుల్లో చలనం లేదు. చివరకు మహిళా కండక్టర్‌ అందరినీ లోపలకు పంపించే ప్రయత్నం చేసింది. బస్సు ఆగి అప్పటికే 50 నిమిషాలు దాటింది. చేసేదేమీ లేక డ్రైవర్‌ బస్సును కదిలించాడు. చిన్నగా వెళతాను.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement